- కాంగ్రెస్ పార్టీకి 46 శాతం నుంచి 48 శాతం ఓట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్ సర్వేలు
- బీఆర్ఎస్ పార్టీకి 42 శాతం వరకు ఓట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్ సర్వేలు
- బీజేపీకి 6 నుంచి 8 శాతం ఓట్లు వస్తాయన్న సర్వేలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు పోలింగ్ ముగియగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్‌లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 46 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41 శాతం నుంచి 42 శాతం ఓట్లు, బీజేపీకి 6 నుంచి 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఈ విధంగా ఇలా ఉన్నాయి
చాణక్య స్ట్రాటజీస్ – కాంగ్రెస్ 46 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం.
పీపుల్స్ పల్స్ – కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం.
స్మార్ట్ పోల్ – కాంగ్రెస్ 48.2 శాతం, బీఆర్ఎస్ 42.1 శాతం, బీజేపీ 8 శాతం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవబోతుందన్న టీపీసీసీ చీఫ్
- ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయం చెప్పాయన్న మహేశ్ కుమార్ గౌడ్
- ప్రజలంతా నవీన్ వైపు నిలిచారని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు.
ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ముందుండి నడిపించారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని, ఆయన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీపీసీసీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో తాము సఫలీకృతం చెందామని ఆయన అన్నారు.