తెలంగాణ రాజకీయ వార్తలు ..

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం…రేవంత్ కష్టానికి దక్కిన ప్రతిఫలం

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. సీఎం రేవంత్ రెడ్డి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది … సాధారణంగా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రిలు ఎవరు ప్రచారం చేయరు ..నేను నాయకున్ని కాదు కార్యకర్తను అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై జూబ్లీహిల్స్ ఎన్నికను నడిపించారు …మంత్రులనందరిని అక్కడ మోహరింప చేయడమే కాకుండా ప్రతి ఇద్దరు మంత్రులకు ఒక డివిజన్ ఇంచార్జిలుగా నియమించారు ..పక్క ప్లాన్ , ఎం ఐ ఎం , ఉభయ కమ్యూనిస్టుల మద్దతు లభించింది …బీసీ మంత్రం సైతం పనిచేసింది ..వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఫలితం దక్కింది …ఇది ఓడిపోతే కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రచారం జరిగేది …గతంలో ఎన్నడూ చేయాలని విధంగా పార్టీ అంతా కలిసి కట్టుగా పనిచేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి చివరి వరకు నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు.

శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. లెక్కింపు ప్రక్రియలో ఏ దశలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్‌కు పోటీ ఇవ్వలేకపోయారు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీని పెంచుకుంటూ నవీన్ యాదవ్ తన గెలుపును సులభతరం చేసుకున్నారు.

అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ..శాతాలు

కాంగ్రెస్ – 98,988(50.83%)..
బీఆర్ఎస్ – 74,259(38.13%)..
బీజేపీ – 17,061(8.76%)..
24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ కీలక ఉప ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ గెలుపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

నాపై దుష్ప్రచారం చేసి గెలవాలనుకున్నారు: ‘జూబ్లీహిల్స్’ విజేత నవీన్ యాదవ్
తనపై దుష్ప్రచారం చేశారన్న నవీన్ యాదవ్
ప్రజలు ఓటు హక్కుతో తిప్పికొట్టారన్న నవీన్ యాదవ్
ఎన్నికలు ముగిశాయి.. అందరం కలిసి అభివృద్ధి కోసం పని చేద్దామని పిలుపు

గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని, ప్రజలకు ఆ విషయం చెప్పుకోలేక తమపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని చూసిందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ప్రజలందరూ తమ ఓటుతో బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాలను తిప్పికొట్టారని ఆయన అన్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తన విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని ఆయన అన్నారు. ఈరోజుతో ఎన్నికలు ముగిశాయని, మనమందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని ఆయన అన్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన నవీన్ యాదవ్, నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

కేసీఆర్ గురించి అందుకే మాట్లాడను: జూబ్లీహిల్స్ ఫలితంపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy Comments on Jubilee Hills Result and KCR
  • ఈ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనందువల్ల ఆయన గురించి మాట్లాడబోనన్న రేవంత్ 
  • కేటీఆర్‌కు అహంకారం పోలేదని, హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని సూచన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందని అన్నారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

కేసీఆర్ క్రియాశీలకంగా లేరు

రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకంగా లేనందున తాను ఆయన గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని అన్నారు. అయితే కేటీఆర్‌కు అహంకారం పోలేదని, హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు.

వారి తీరు మారకుంటే ప్రజలు ఎలా అంగీకరిస్తారన్న విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రుల అభిప్రాయాలను తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్
ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంటామన్న కేటీఆర్
కార్యకర్తలు, మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారన్న కేటీఆర్
ఉప ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్య

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు ఆయన నమస్సులందించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని స్థానిక నాయకత్వం ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేశారని కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. ఒక విధంగా ఆమె పోరాటమే చేశారని కొనియాడారు. గత రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా అద్భుతమైన పాత్రను పోషిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యలను ప్రధానంగా ఎంచుకొని పోరాడుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉప ఎన్నికల్లో తాము ఎంతో నిజాయతీగా పోరాడామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని ఆయన అన్నారు. వాటి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. ప్రచారం ముగిసే వరకు ఒక విధంగా, ముగిసిన తర్వాత మరో విధంగా జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 నుంచి 2023 మధ్య ఏడు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒక్క దాంట్లో కూడా గెలవలేదని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

ప్రజా సమస్యలను, ఆరు గ్యారెంటీలను, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళతామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని రకాలుగా కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం పాటించామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా సమస్యలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిద్దామని ఆయన అన్నారు.

జాతీయస్థాయిలో చూస్తే బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్‌కు ఈ ఉప ఎన్నిక ఒక చిన్న ఎదురుదెబ్బ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలు పెట్టినా దీటుగా ఎదుర్కొని మంచి ఓటింగ్ సాధించామని అన్నారు. దొంగ ఓట్ల గురించి తాము స్పష్టమైన ఆధారాలు ఇచ్చామని, పోలింగ్ రోజు కూడా మాగంటి సునీత ఈ వ్యవహారాన్ని బయటపెట్టారని ఆయన గుర్తు చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యే విషయమై బెంగాల్‌లో హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిందని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో కూడా పదిచోట్ల ఉప ఎన్నికలు రావాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉప ఎన్నికకే కాంగ్రెస్ చాలా కష్టపడిందని, ఇక పదిచోట్ల ఉప ఎన్నికలు వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువస్తారేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఆర్-ఎస్ బ్రదర్స్ ‘పరస్పర సహకారంతో బాగా పనిచేశారని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికలో అది స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు.

Related posts

నా భుజంపై చేయి వేసి రాహుల్ గాంధీ గెలిపించమంటే ప్రజలు నన్ను ఓడించారు: జగ్గారెడ్డి

Ram Narayana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్… తిరిగి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే!

Ram Narayana

ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు: కిషన్ రెడ్డి

Ram Narayana