ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అరెస్ట్ చేసుకోండి… ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు..

అరెస్ట్ చేసుకోండి… ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు

Ambati Rambabu Says Arrest Me I Dont Care
  • దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి అంబటి సవాల్
  • ఇది జంగిల్ రాజ్ అంటూ మండిపడ్డ గుడివాడ అమర్నాథ్
  • కర్మ తిరిగొస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని టీడీపీకి వైసీపీ హెచ్చరిక
  • అంబటి రాంబాబుపై కేసు నమోదు… అరెస్ట్ చేసే అవకాశం!

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. “మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, ఇది మరోసారి రుజువైందని అన్నారు. “మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం” అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. 

జగన్ ఫోన్‌… పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా

Ambati Rambabu Attacked Jagan Assures Support
  • అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్
  • రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ
  • చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపణ
  • పోలీసుల తీరుపై మండిపడ్డ మాజీ సీఎం

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. తనపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని అంబటి ఆరోపిస్తున్న నేపథ్యంలో జగన్ ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ.. రాష్ట్రం జంగిల్ రాజ్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఆయన దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వై‌సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేక్షకుల మాదిరిగా వ్యవహరించడం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని ఆయన హెచ్చరించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని అంబటి రాంబాబుకు జగన్ భరోసా ఇచ్చారు.

“మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్‌రాజ్‌’’గా మారిపోయింది. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు. మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబుగారూ, మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం” అని ధ్వజమెత్తారు.

“తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు, పశు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబ్ లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తప్పులను దాచిపెట్టేందుకు దాడులు చేయిస్తున్నారు. ల్యాబ్ ల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించి, మా నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. ఇప్పుడు అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకోవడం మీ నియంత స్వభావానికి నిదర్శనం. ఒక కరడుగట్టిన గూండాగా మీరు తయారయ్యారు” అంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని జగన్ తెలిపారు. దాడులను అడ్డుకోవడంలో విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తారని జగన్ వెల్లడించారు. 

  • సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటి రాంబాబుపై కేసు
  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో చర్యలు
  • గుంటూరులోని అంబటి నివాసంపై టీడీపీ కార్యకర్తల దాడి
  • ఇంటి అద్దాలు, ఫర్నిచర్, కారు ధ్వంసం
  • అంబటి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

సీఎంపై అంబటి రాంబాబు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిళ్లి మాణిక్యల రావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి అంబటిపై కేసు నమోదు చేశారు.

ఈ పరిణామం నేపథ్యంలో గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు ఆగ్రహంతో ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కిటికీ అద్దాలు, ఫర్నిచర్, కారు ధ్వంసమయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా, ఈ రాత్రికి అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అప్పటికే ఆయన నివాసం వద్దకు ‘వజ్ర’ వాహనాన్ని తరలించారు. 

Related posts

పెమ్మసాని 18 రోజులు సినిమా చూపించాడు.. పారిపొమ్మని సీఐ చెప్పాడు: అంబటి రాంబాబు

Ram Narayana

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటమంతీ!

Ram Narayana

ఏపీలో ఈ సారి ఎన్నికలు అంత ఈజీగా ఉండవు: బాలినేని

Ram Narayana