ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేత కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం..ఈ సంఘటను తీవ్రంగా ఖండిస్తున్నా..మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
ఖమ్మం వెలుగుమట్ల పరిధిలో ఉన్న 60 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు 600 పేద కుటుంబాలపై వేలాది మంది పోలీసులతో దాడి చేసి, జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడం అమానుషం, అతిక్రూరంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్లుగా అక్కడే నివసిస్తూ తమకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, న్యాయపరంగా పోరాడుతున్న పేదలపై ఈ విధంగా ప్రతాపం చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు. హైకోర్టు స్టే పేరుతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు స్వయంగా మంత్రి తుమ్మల ఆదేశాలతో రంగంలోకి దిగి పోలీస్ బలగాలను మొహరించి గుడిసెలు కూల్చివేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు.
భూదాన్ భూములపై ఎప్పటినుంచో కన్నేసిన జిల్లా మంత్రి తుమ్మల సన్నిహితులు రియల్ ఎస్టేట్ వారు ఎప్పటి నుంచో వాటిని ఆక్రమించుకునేందుకు ప్రణాళిక తో పావులు కదుపుతూ ఈరోజు తెల్లవారుజామునే భారీ పోలీస్ బలగాలతో పేదల ఇళ్లను ఖాళీ చేయించడం నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. ఇళ్లు కూల్చివేసి నిరాశ్రయులను రోడ్డుపైకి నెట్టివేయడం మానవత్వాన్ని మరిచిన చర్యగా వారు అభివర్ణించారు.
బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నదని మాజీ శాసనసభ్యుడిగా,మాజీ జిల్లా మంత్రిగా ప్రజల తరపున అండగా తాను నిలుస్తూ న్యాయపరంగా మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అధికారం ఉందని పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్పక తప్పదని స్పష్టం చేశారు.వెంటనే కూల్చివేతలను నిలిపివేసి, అర్హులైన పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.