- కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ
- పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధను అభివృద్ధిపై పెడితే బాగుండేదని వ్యాఖ్య
- పేర్లు మార్చడమే తప్ప ప్రాజెక్టులు మాత్రం ఇవ్వరంటూ విమర్శ
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’ గా మారుస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ శశి థరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ కేంద్రానికి అభివృద్ధిపై లేదని విమర్శించారు. ‘‘కేరళకు కేంద్రం ఒక్క ఎయిమ్స్ కానీ, కొత్త విద్యా సంస్థలు కానీ ఇవ్వలేదు. బడ్జెట్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించలేదు. కానీ పేరు మార్చమంటే మాత్రం వెంటనే ఆమోదిస్తారు’’ అంటూ థరూర్ ఎద్దేవా చేశారు.
భాషా పరమైన ప్రశ్న
మలయాళంలో ఇప్పటికే దాన్ని ‘కేరళం’ అనే పిలుస్తారని, ఇప్పుడు ఇంగ్లీషులోకి కూడా అదే పదాన్ని తీసుకురావడంలో అర్థం లేదని థరూర్ విమర్శించారు. ‘ఇప్పుడు కేరళ ప్రజలను ఏమని పిలవాలి.. ‘కేరళమైట్’ అందామంటే అదేదో బ్యాక్టీరియాలా అనిపిస్తోంది. ‘కేరళమియన్’ అందామంటే ఖనిజంలా ఉంది’ అని థరూర్ చమత్కరించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ పేరు మార్పు..
అన్ని భారతీయ భాషల్లోనూ ‘కేరళం’ అనే పేరు ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.