పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ నేడు తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కేవలం హామీలు మాత్రమే కాకుండా, కేంద్రాన్ని నిలదీస్తూ వ్యాఖ్యలు చేశారు.
దీదీ ప్రకటించిన 10 హామీలు:
ఓటర్లను ఆకర్షించేందుకు మమత సంక్షేమ పథకాల వర్షం కురిపించారు.
- లక్ష్మీ భండార్ పెంపు: జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు రూ. 1,500, ఎస్సీ/ఎస్టీ మహిళలకు రూ. 1,700 ఆర్థిక సాయం.
- యువతకు అండ: ‘బంగ్లార్ యువశక్తి’ కింద నిరుద్యోగ యువతకు నెలకు రూ. 1,500 భృతి.
- వ్యవసాయ బడ్జెట్: రైతుల కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక అగ్రికల్చర్ బడ్జెట్.
- ద్వారే చికిత్స: ప్రతి బ్లాక్‌లోనూ ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేలా మెడికల్ క్యాంపులు.
- ఆధునిక విద్య: ‘బంగ్లార్ శిక్షాయతన్’ కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ.
- సొంతింటి కల: ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహ నిర్మాణం.
- తాగునీరు: ప్రతి ఇంటికీ పైపుల ద్వారా శుద్ధి చేసిన తాగునీటి సరఫరా.
- వృద్ధాప్య పింఛన్: అర్హులైన వృద్ధులందరికీ నిరంతరాయంగా పెన్షన్ అందేలా చర్యలు.
- పరిపాలన సౌలభ్యం: కొత్తగా 7 జిల్లాలు, మరిన్ని మున్సిపాలిటీల ఏర్పాటు.
- గ్లోబల్ ట్రేడ్ సెంటర్: బెంగాల్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ అభివృద్ధి.
మేనిఫెస్టో విడుదల అనంతరం మమత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ఎన్‌ఆర్‌సీ, జనగణన పేరుతో పౌరసత్వాన్ని తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అనధికార రాష్ట్రపతి పాలన నడుస్తోందని… బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది:
- మొదటి దశ: ఏప్రిల్ 23
- రెండవ దశ: ఏప్రిల్ 29
- ఫలితాలు: మే 4