అప్పుల ఊబి…అంకెల గారడీ బడ్జెట్ పై సిపిఐ పక్ష నేత కూనంనేని …
ఇప్పయికే 8.64 కోట్ల అప్పులు …మరో లక్ష కోట్ల బకాయిలు
చెప్పకుండానే పన్నులు …ప్రజల రక్తం పేల్చుతున్నారు
ఆర్టిసి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి, జర్నలిస్టుల ప్రస్తావన లేకపోవడం దారుణం
బడ్జెట్ ఉగాది పచ్చడిలా …తీపి చేదు కలయిక
కేంద్ర ప్రభుత్వ సహాయం లేకపోతే ‘చల్తీ కా నామ్ గాడీ తరహాలో ప్రభుత్వ పరిపాలను సాగుతుందన్న కూనంనేని
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా మిశ్రమంగా ఉందని సిపిఐ శాసనసభా పక్షం నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ఆయన స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రూ. 8.64 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. దీంతో పాటు మరో రూఒక లక్ష కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ లెక్కలు ఈ బడ్జెట్ చూపించలేదని పేర్కొన్నారు. ఇంత డబ్బు ఎలా తీసుకువస్తారనేది పెద్ద ప్రశ్న? ఈ దశలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదని, ఎవరూ కూడా చేయగలిగిందేమీ లేదన్నారు. ఉన్న దాంట్లో కొంచెం కష్టమైన, క్లిష్టమైన స్థితిలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చేదు, తీపిల మిశ్రమంగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో ఏ వస్తువు పైనా ఎంతెంత పన్నులు పెంచేది అనేది మనకు తెలిసేది కానీ, జిఎస్ టి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలియడం లేదని, మనకు తెలియకుండానే మన రక్తం తాగేస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు. అందువలన ఈ బడ్జెట్ మంచిదా, చెడ్డదా చెప్పడానికి లేదన్నారు. ఈ బడ్జెట్ 1 కోటి 50 లక్షల కుటుంబాలకు కుటుంబ జీవిత భీమా సౌకర్యం కల్పించడం మంచి పరిణామమని, కుటుంబంలోని ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా వస్తుందని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామనడం మంచి పరిణామమని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు అందించి, నగదు రహిత వైద్యం సౌకర్యం కలించడంతో 23.5 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే పెన్షనర్లు, ఉద్యోగులకు ప్రమాదం జరిగితే రూ. 1.20 కోట్ల భీమా వర్తింపజేయడం, 60 సంవత్సరాలు నిండిన తర్వాత సహాజ మరణం పొందితే రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించడం ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
విద్యకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి..
విద్యా రంగానికి సంబంధించి పాత బడ్జెట్ పోల్చితే ఏమి మెరుగు లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. గత బడ్జెట్ విద్యకు 7.57 శాతం నిధులు కేటాయిస్తే, ఈ బడ్జెట్ 8.22 శాతం కేటాయించారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ విద్యకు కనీసం 20 శాతం అయిన నిధులు కేటాయించాలని విద్యావేత్తలు చెబుతున్నారనీ, కానీ విద్య, వైద్య రంగాల్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం ఫెయిల్ అయిందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఉన్నత విద్య, స్పోర్ట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి వాటిపై కొంత ఫోకస్ పెడుతున్నారు, కానీ కింది స్థాయికి వెళితే మాత్రం యూనివర్సిటీలలో కనీసం ప్రొఫెసర్లు, టీచర్లు, లెక్చరర్ల నియామకం కూడా చేపట్టడం లేదన్నారు. ఔట్ ఉద్యోగుల పేరుతో నెట్టుకొస్తున్నారు, అందువల్ల విద్యరంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
వైద్య రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలి..
వైద్య రంగానికి సంబంధించి బడ్జెట్ 4.2 శాతం మాత్రమే నిధులు కేటాయించారని, కనీసం 10 శాతం అయిన కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా చూస్తే బడ్జెట్ కొన్ని మంచిగా ఉన్న, కొన్ని అంశాలు ఇంకా దిగజారుడుగానే కనిపిస్తున్నాయన్నారు. ‘గత బడ్జెట్ 3.04 లక్షల కోట్లు అయితే, రివైజ్ దాంట్లో రూ. 2. 81 కోట్లు తీశారు. అంటే రూ. 22 వేల కోట్లు ఖర్చు చేయలేదు. మార్చి 31 వ తేదీ వరకు మొత్తంగా క్లారిటీ వస్తుంది. ప్రస్తుత బడ్జెట్ రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో మళ్లీ అప్పు దాదాపు రూ.58 వేల కోట్ల బడ్జెట్ లోటు చూపిస్తున్నారు. అంటే మళ్లీ అప్పు చేయాల్సిందే. గత బడ్జెట్ రూ. 22 వేల కోట్లు తగ్గినట్టుగానే ఈ బడ్జెట్ కూడా సుమారు రూ. 40 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. అంటే ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ ఆడంభరంగా అంకెల్లో కనిపించే బడ్జెట్, వాస్తవికంగా వచ్చే సరికి నిధులు సరిపోవట్లేదు. ఈ బడ్జెట్ పేద వారి ప్రస్తావన ఎక్కడ కనిపించలేదు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టిసి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి, జర్నలిస్టుల ప్రస్తావన లేకపోవడం దారుణం. పాత బడ్జెట్ యధాతధంగా కొత్త బడ్జెట్ ఎక్కించారు. కొద్దిగా పెంచుకుంటూ వెళ్లారు. కానీ, పైన పేర్కొన్న వారి పరిస్థితి ఏంటి? పరిష్కారం ఎలా? అని ప్రశ్నించారు. గత బడ్జెట్ ఇందిరమ్మ ఇండ్లకు రూ. 14 వేల కోట్లుగా కేటాయించారు. కానీ, ప్రస్తుతం రూ. 7 వేల కోట్లు కేటాయించారు. అంటే సగానికి సగం కోత విధించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 4.50 లక్షల ఇళ్లు ఇచ్చారు. ఒక్కొ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. ఇప్పుడు 3,500 ఇళ్లు ఉంటాయా? లేక పాత వాటికే ఖర్చు పెడతారా? ఈ చర్యలతో ప్రభుత్వం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతిమంగా రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కచ్చితంగా అవసరముంది. లేకపోతే ‘చల్తీ కా నామ్ గాడీ తరహాలో ప్రభుత్వ పరిపాలను సాగుతుంది’ అని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.