ఆంధ్రప్రదేశ్

వియ్యాల వారి వింత కయ్యం.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి!

పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు, అలకలు సర్వసాధారణం. భోజనాలు, మర్యాదల విషయంలో వియ్యాల వారి మధ్య మనస్పర్థలు రావడం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ వరుడి కుటుంబం విచిత్రమైన కారణంతో ఏకంగా పీటల మీద పెళ్లిని రద్దు చేసుకుంది. కల్యాణ మండపంలో తమకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ ముహూర్తానికి కొన్ని గంటల ముందు వివాహాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయింది. కడప జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే… కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన సులేమాన్‌కు, కడప నగరానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మార్చి 28వ తేదీన ఓ కల్యాణ మండపంలో పెళ్లికి ఇరు కుటుంబాలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. ముహూర్తం రోజున బంధుమిత్రులతో కలిసి వరుడి కుటుంబం పెళ్లి మండపానికి చేరుకుంది. అంతా సవ్యంగా జరుగుతోందనుకుంటున్న సమయంలో వరుడి తరఫు వారు మండపంలో తమకు కేటాయించిన గదుల్లో సరైన వసతులు లేవని వధువు కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు.

ఈ చిన్నపాటి గొడవ కాస్తా పెద్దదిగా మారింది. వధువు తరఫు వారు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, బతిమాలినా వరుడి కుటుంబ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత తాము మళ్లీ వస్తామని చెప్పి వరుడి కుటుంబం మొత్తం కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. ముహూర్తం సమయం దగ్గర పడుతున్నా వారు తిరిగి రాకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని వధువు కుటుంబం నిర్ధారించుకుంది. ఈ అనూహ్య పరిణామంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మ‌న‌స్తాపానికి గురయ్యారు.

ఈ ఘటనపై వధువు తండ్రి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం సౌకర్యాలు బాగోలేవనే సాకుతో తమ కుమార్తె జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు సులేమాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, మార్చి 28న ఘటన జరిగితే, ఆల‌స్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇంత చిన్న కారణంతో పెళ్లిని రద్దు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

టీడీపీలో కష్టపడేవారికే పదవులు .. రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్‌

Ram Narayana

తుళ్లూరు పోలీసుల‌ కస్టడీకి జర్నలిస్ట్ కృష్ణంరాజు .. మూడు రోజుల విచారణ

Ram Narayana

కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన

Ram Narayana