తెలంగాణ వార్తలు

ఆర్టీసీ సమ్మెలో విషాదం: చికిత్స పొందుతూ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి

  • సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్‌గౌడ్
  • హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూత
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మార్పణ
  • కార్మికులు ఆందోళన విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి
  • నేడు కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (55) మృతి చెందారు. 80 శాతం కాలిన గాయాలతో హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అసలేం జరిగింది?
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తోటి కార్మికులు, పోలీసులు వెంటనే మంటలు ఆర్పినప్పటికీ తీవ్ర గాయాలయ్యాయి. తొలుత వరంగల్ ఎంజీఎంకు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఉద్రిక్తంగా మారిన సమ్మె
శంకర్‌గౌడ్ మరణంతో రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే తరహాలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మరో ఇద్దరు డ్రైవర్లు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కార్మికుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను స్పష్టం చేస్తోంది. మరోవైపు, రెండో రోజైన గురువారం కూడా సమ్మె కొనసాగింది. ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో, పోలీసు బందోబస్తు మధ్య సుమారు 45 శాతం బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. అయితే, బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడ్డారు.

ప్రభుత్వ స్పందన, చర్చలకు ఆహ్వానం
ఈ వరుస పరిణామాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మికులు ఆత్మహత్యల వంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో సహా పలువురు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్మిక సంఘాల నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.

శంకర్‌గౌడ్ మృతికి ప్రభుత్వ వైఖరే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ 32 డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని, నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం-కార్మిక సంఘాల మధ్య జరగబోయే చర్చలు కీలకం కానున్నాయి.

ఆర్టీసీ డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కార్మికులకు కీలక విజ్ఞప్తి

cm revanth reddy reacts to rtc driver shankar goud passedaway
  • నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
  • మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
  • క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంపై సీఎం తీవ్ర విచారం
  • తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి
  • సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి

నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. “క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది” అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఎలాంటి తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Telangana Govt Announces Ex Gratia For Deceased Tgsrtc Driver Shankar Goud Family
  • రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
  • కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
  • వ్యక్తిగతంగా రూ. 5 లక్షల సాయం ప్రకటించిన నర్సంపేట ఎమ్మెల్యే
  • మృతదేహంతో కార్మికుల ఆందోళన.. ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం

టీజీఎస్ఆర్టీసీ సమ్మెలో భాగంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన‌ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రభుత్వం, తక్షణమే స్పందించి పరిహార చర్యలు చేపట్టింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అధికారికంగా వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వం తరఫున శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం (ఎక్స్‌గ్రేషియా) అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. దీంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో వారికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగత హోదాలో మరో రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో శంకర్ గౌడ్ కుటుంబానికి మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఆర్డీవో ఉమారాణి స్వయంగా శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గత 25 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలందించిన శంకర్ గౌడ్‌కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. ఆయన భార్య దివ్యాంగురాలు కావడం, సొంత ఇల్లు లేకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 

ముత్తోజిపేటలో ఉద్రిక్తత
శంకర్ గౌడ్ అంత్యక్రియలను ఆయన కుమార్తె నివసిస్తున్న ముత్తోజిపేట గ్రామంలో నిర్వహించనున్నారు. ఆయన మరణంతో ముత్తోజిపేట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించాలని ఆర్టీసీ కార్మికులు, నాయకులు పట్టుబట్టారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొని, మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.

అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికుల నిరసనలతో ముత్తోజిపేటలో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది.

ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ… లిఖితపూర్వక హామీకి జేఏసీ నేతల డిమాండ్

RTC JAC meeting with ministers
  • సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, లక్ష్మణ్
  • శంకర్ గౌడ్ మృతిపట్ల మంత్రులు, జేఏసీ నేతల సంతాపం
  • 29 అంశాలకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపిన మంత్రులు
  • మూడు అంశాలపై అధ్యయనం చేయాలన్న మంత్రులు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ కూడా హాజరయ్యారు.

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రులు, జేఏసీ నేతలు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఏ కార్మికుడు కూడా ఆవేశంతో అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణమే అమలు చేయాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు.

కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు తెలిపారు. మిగిలిన మూడు అంశాలపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని అన్నారు. అయితే ఏయే డిమాండ్లు ఎప్పటిలోగా అమలు చేస్తారో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలు, ఉద్యోగం

ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. స్థానిక ఆర్డీవో ఉమారాణి ఆయన మృతదేహానికి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. పరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్టీసీ డ్రైవర్ మృతికి రేవంత్ రెడ్డే కారణం: హరీశ్ రావు

Revanth Reddy responsible for RTC driver death says Harish Rao
  • నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్
  • 80 శాతం గాయాలతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • ప్రభుత్వ అలసత్వం వల్లే శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారన్న హరీశ్
  • ఇలాంటి ప్రాణ త్యాగాలకు ఎవరూ పాల్పడవద్దని సూచన

వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్, 80 శాతం గాయాలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఆయన మృతితో రాష్ట్రంలో విషాదం నెలకొంది. 

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వం వల్లే శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అప్పాయింటెడ్ డే’గా ప్రకటించి ఆయన త్యాగాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి తప్ప, ఎవరూ ఇలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం స్వస్థలానికి తరలిస్తున్నారు. ఇవాళ జరిగే అంత్యక్రియలకు భారీ సంఖ్యలో కార్మికులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో వరంగల్, నర్సంపేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay Reacts to Narsampet RTC Driver Suicide
  • శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్య అన్న బండి సంజయ్
  • ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శ
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని వెల్లడి

నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లలో న్యాయం ఉందని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు బీజేపీ మద్దతు పలుకుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ తన ‘అభయహస్తం’ హామీల జాబితాలో పేర్కొందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీ యూనియన్‌ పునరుద్ధరణకు అనుమతిస్తామని కూడా చెప్పిందని గుర్తు చేశారు.

KTR response on Shankar Goud suicide
  • ఈ ఉదయం మృతి చెందిన శంకర్ గౌడ్
  • పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు అనుమతించకపోవడం దుర్మార్గమన్న కేటీఆర్
  • అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ‘హత్య’ అని ఆయన అన్నారు. శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా కార్మిక నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కుటుంబ పెద్దను కోల్పోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో ఒక ‘చీకటి రోజు’ అని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.

Related posts

చంద్రబాబు, వైఎస్ఆర్ భావితరాల కోసం ఆలోచించారు: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు

Ram Narayana

 హైదరాబాద్ లో 6.5 కోట్ల నగదు పట్టివేత…అవి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడివేనా …? 

Ram Narayana