ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి…
- సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో ఘటన
- అడవిలో గొర్రెలు మేపొద్దన్నందుకు కర్రలు, రాళ్లతో దాడి
- తలపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
- భూమి కోసమే హత్యాయత్నం జరిగిందని ఆరోపణ
ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్శర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో దుశ్శర్ల సత్యనారాయణ ఎన్నో ఏళ్లుగా మొక్కలను పెంచి దాన్ని ఒక దట్టమైన అడవిగా మార్చారు. గురువారం ఆయన లేని సమయంలో కొందరు గొర్రెల కాపరులు తమ గొర్రెలను ఆ అడవిలో మేపుతూ చెట్ల కొమ్మలను నరుకుతున్నారు. గురువారం రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య గంగయ్య, మల్లయ్య ఆ అడవిలో చెట్లు నరుకుతూ, గొర్రెలను మేపుతూ కనిపించారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన సత్యనారాయణ తన అడవిలో గొర్రెలను ఎందుకు మేపుతున్నారని వారిని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మాటామాటా పెరిగి, గొర్రెల కాపరులు కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో ఆయనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
“మా ఇష్టం, ఇక్కడే మేపుతాం” అని బెదిరించి తనపై దాడి చేశారని సత్యనారాయణ తెలిపారు. తన 70 ఎకరాల అడవిని ఆక్రమించుకునేందుకే పథకం ప్రకారం తనపై హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తనకు రక్షణ కల్పించి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: