మళ్ళీ మోడీనే ప్రధాని …కేసీఆర్ సీఎం సీటు కాపాడుకుంటే చాలు …చేవెళ్ల సభలో అమిత్ షా…
-కేసీఆర్ ప్రధాని అవ్వాలని కలలు కంటున్నారని విమర్శలు
-ప్రధాని సీటు ఖాళీగా లేదన్న అమిత్ షా
-చిలుకూరు బాలాజీ ఆశీర్వాదంతో మాట్లాడుతున్నానంటూ ప్రసంగం
-మోదీనే మళ్లీ ప్రధాని అవుతారని ధీమా
-తెలంగాణలో ఈసారి బీజేపీ గెలుస్తుందని వెల్లడి
మోడీనే మళ్ళీ ప్రధాని … కేసీఆర్ ప్రధాని కావాలని కళలు కంటున్నారు …ఆయన సీఎం సీటు కాపాడుకుంటే చాలు …కేసీఆర్ అవినీతి పాలన , లీకుల పాలన అందిస్తున్నారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు . ఆదివారం చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు . మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పేపర్ లీకుల పేరుతో అరెస్ట్ చేశారు . పేపర్ లీక్ పై ప్రశ్నించిన బండి సంజయ్ ని జైల్లో పెట్టారని, కానీ 24 గంటల్లోనే బెయిల్ వచ్చిందని అమిత్ షా తెలిపారు. బండి సంజయ్ ఏం తప్పు చేశారని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడబోరని స్పష్టం చేశారు. భారత్ మాతా కీ జై అంటూ అమిత్ షా తన ప్రసంగం ప్రారంభించారు. చిలుకూరు బాలాజీ ఆశీర్వాదంతో మాట్లాడుతున్నానని తెలిపారు.
బీఆర్ఎస్ అవినీతి పాలనను, కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 9 ఏళ్లుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని షా పిలుపు నిచ్చారు . తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా వద్దా? అని అన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీకి వినిపించేలా నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మాట్లాడనివ్వడంలేదని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మోదీ నుంచి ప్రజలను దూరం చేయలేరని అమిత్ షా స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు
తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి… పదో తరగతి పేపర్ కూడా లీక్ అయింది.
తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీక్ అవుతోంది. ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించలేని వారికి పాలన అవసరమా? అని అమిత్ షా కేసీఆర్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు .లక్షలాది యువత భవిష్యత్తును కేసీఆర్ సర్కారు నాశనం చేస్తోంది. ఎన్నికల సమరాంగణంలో యువతే కేసీఆర్ కు తగిన బుద్ధి చెపుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు .
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు .
కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారని ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ను ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం చేశారు .ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని , కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని షా ఎద్దవా చేశారు . ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించడంలేదు. కానీ, బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించి చూపించిన విషయాన్నీ గుర్తు చేశారు .
అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తాం. బీజేపీ ఎప్పుడూ ఎంఐఎంకు భయపడేది లేదు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజానీకానికి షా పిలుపు నిచ్చారు.
అమిత్ షా అంటే పులి …బండి సంజయ్ …
అమిత్ షా అంటే పులి ….కార్యకర్తలకు అండగా ఉండే నిజమైన నాయకుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షా ను పొగడ్తలతో ముంచెత్తారు . తనను కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నా భార్యకు అమిత్ షా ఫోన్ చేసి నేనున్నానని భరోసా ఇచ్చిన విషయాన్నీ సంజయ్ ప్రస్తావించారు . ఇక కేసీఆర్ పై వేట మొదలైందని అందుకే పులి చేవెళ్లకు వచ్చారని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు .సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , ఈటెల రాజేందర్ , విశ్వేశ్వర రెడ్డి ,పొంగులేటి సుధాకర్ రెడ్డి ,డీకే అరుణ ,ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు .