Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్‌ను గెలిపించకుంటే పథకాలు రావనే భయంవద్దు!: పవన్ కల్యాణ్

జగన్‌ను గెలిపించకుంటే పథకాలు రావనే భయంవద్దు!: పవన్ కల్యాణ్..
మంగళగిరిలో వీరమహిళలతో జనసేనాని భేటీ
తాడేపల్లి ప్రాంతంలోనే అధిక క్రైమ్ రేటు ఉందన్న పవన్ కల్యాణ్
ఇలాంటి వాటిపై మహిళా కమిషన్ మాట్లాడదని ఆగ్రహం
ఎన్ని స్పందన కార్యక్రమాలు పెట్టినా ఫలితం ఉండదని వ్యాఖ్య
మహిళలు అదృశ్యమయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్న జనసేనాని
ప్రతి ఒక్కరు తప్పు జరిగితే ప్రతిఘటించాలని సూచన
సీఎం స్థాయి వ్యక్తి ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని అంటగట్టి మాట్లాడుతున్నారని ఆవేదన

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ నివసించే తాడేపల్లి ప్రాంతంలోనే అత్యధిక క్రైమ్ రేట్ నమోదవుతోందన్నారు. అక్కడ గ్యాంగ్ రేప్‌లు, హత్యలు జరిగాయని, ఇలాంటి వాటిపై మాత్రం మహిళా కమిషన్ ఏమీ మాట్లాడదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎన్ని స్పందన కార్యక్రమాలు పెట్టినా ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

అత్యాచారం చేస్తామని మహిళలను బెదిరించేలా ఉందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడం చాలా పెద్ద విషయమని, 30 వేలమంది అదృశ్యమయ్యారన్నారు. జనసేన తరఫున ప్రజాకోర్టు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు. తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాలని, మీ బిడ్డలకు కూడా దీనిని నేర్పించాలని వీరమహిళలకు సూచించారు. మహిళలు తలుచుకుంటే మార్పు సాధ్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు ఫోటో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించదని, కేవలం ముఖ్యమంత్రి ఫోటోలు మాత్రమే పెడుతున్నారన్నారు. మన కోసం బలిదానం చేసిన వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో 15 మంది మహిళలు కూడా పాలుపంచుకున్నారన్నారు. జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు.

వైసీపీని గెలిపించకపోతే పథకాలు రావనే భయంవద్దని, ఇంకా మంచి చేసే పథకాలు జనసేన తీసుకు వస్తుందన్నారు. దయచేసి అండగా నిలబడండి… మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామని, విశాఖ ఉక్కు కూడా కాపాడుకుంటామన్నారు. కనీసం గోదావరి జిల్లాల్లో త్రాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని, భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డుగా మారిందని, కాలుష్యానికి నిలయంగా తయారు చేశారన్నారు.

పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కాంట్రాక్టులకు 6 నుండి 8 శాతం కమీషన్‌ను ముఖ్యమంత్రి, మంత్రులకు ఇవ్వాల్సి వస్తుందని టీవీలలో చెప్పినా చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ ఆస్తులపై, దోపిడీపై సమాచారం ఇచ్చిన వారికి బహుమతి ఇచ్చే పద్ధతిని తీసుకు వస్తామన్నారు. చెత్తమీద కూడా ట్యాక్స్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాథమిక భాద్యతలు పాటించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాయకులు సరైన వారా? కాదా? అనేది అర్థం చేసుకోవాలన్నారు. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని, ఈరోజు సీపీఎస్ రద్దు, మద్యనిషేదం, ఉద్యోగాల విషయాలపై ప్రశ్నించలేక పోతున్నారన్నారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని అంటగట్టి మాట్లాడుతారని, ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. 38 కేసులు ఉన్న జగన్ కోర్టు తీర్పును తప్పుబడతారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదని, పర్యావరణ పరిరక్షణ చేయకుండా రుషికొండ వంటి వాటిని ధ్వంసం చేస్తున్నాడన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఎదుటివారి మనసును నొప్పించేలా మాట్లాడటం సరికాదన్నారు. అది భావప్రకటనా స్వేచ్ఛ కాదన్నారు.

విదేశీ కంపెనీలకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని, రాజ్యాంగం కూడా సూచించిందని కానీ జగన్ అధికారంలోకి రాగానే జపాన్ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకున్నాడన్నారు. సెక్యులరిజం పేరిట ఇతర మతాలను తిట్టడం, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించటం ఆక్షేపణీయమన్నారు. ఆయేషా మీరా, శ్రీలక్ష్మి, సుగాలి ప్రీతి.. ఇలా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్నేళ్ళ క్రితం వరంగల్ లో స్వప్నిక అనే ఆడకూతురు యాసిడ్ దాడికి గురైందని, ఆమెను చూడడానికి వెళ్తే మరో ఆడబిడ్డకు ఇలా జరగకుండా చూడు అన్నా అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు.

Related posts

పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్…

Ram Narayana

రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణ , లోకేష్ …!

Ram Narayana

ఏపీ మంత్రి సురేశ్ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు…

Ram Narayana

Leave a Comment