శ్వేతపత్రంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల ఢీ…!
గత ప్రభుత్వ డొల్లతనాన్ని ,ఆర్థిక అక్రమాలపై శ్వేతపత్రం
శ్వేతపత్రం ఫేక్ అన్న బీఆర్ యస్
అడ్డగోలుగా దోచుకున్నారన్న కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేడు శ్వేత పత్రంపై జరిగిన చర్చలు టిఆర్ఎస్ కాంగ్రెస్ లమధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటలు యుద్ధం కొనసాగింది … ఒక సందర్భంలో ఇది అసెంబ్లీనా…? కురుక్షేత్రమా …? అన్నట్లు తలపించింది…. ఎవరికి వారు దీటుగా శ్వేత పత్రంపై స్పందించారు… పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ అట్టుడికింది … అధికార కాంగ్రెస్ పార్టీ తరుపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 42 పేజీల శ్వేతపత్రాన్ని ప్రవేశపెడుతూ గత పది సంవత్సరాలుగా రాష్ట్రం 6 లక్షల 71 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని అప్పులు పెరిగిన విధంగా ప్రజల సంపద పెరగలేదని గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు … దానిపై వాడి వేడి చర్చలు జరిగాయి….బీఆర్ యస్ తరుపున హరీష్ రావు , చర్చలో పాల్గొని గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప శ్వేత పత్రంలో ఏముంది …? అంతా ఫేక్ అని విరుచుకపడ్డారు ..దీనిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి .శ్రీధర్ బాబు , అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ , మంత్రులు పొన్నం ప్రభాకర్ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి , మదన్ మోహన్ , బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి , ఎంఐఎం నేత అక్బరుద్దీన్ , సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు… శ్వేత పత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి… శ్వేత పత్రంపై ఎవరు ఏమి మాట్లాడుతున్నారని విషయంపై ప్రజలను ఆసక్తి నెలకొన్నది అనేకమంది అసెంబ్లీ కార్యకలాపాలపై టి 20 క్రికెట్ మ్యాచ్ లాగా టీవీలకు అతుక్కొని పోయారు .. అధికార ప్రతిపక్షాల సభ్యుల వాదనా పటిమలో l ఎవరు నెగ్గారు ఎవరు తగ్గారు అనే దాన్ని బెరీజ్ వేసుకుంటున్నారు… నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుకు ఆయన వాక్చాతుర్యానికి ఈ అసెంబ్లీ వేదిక అయింది… బీఆర్ యస్ పై విమర్శలు గుప్పిస్తూనే అందరం కలిసి పనిచేద్దాం …మీ సూచనలను సైతం పరిగణలోకి తీసుకుంటా అని అన్నారు …సచివాలయంలోకి కూడా అందరికి ప్రవేశం ఉంటుందని , అన్ని పార్టీల , ప్రజాసంఘాల , మద్దతుతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ..సిపిఎం , సిపిఐ ఎం ఎల్ పార్టీలను కూడా పిలిచి అఖిల పక్ష సమావేశం పెడతామని సభ సాక్షిగా రేవంత్ రెడ్డి సభ్యులకు హామీ ఇచ్చారు ..
కాళేశ్వరంపై …అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామని చెప్పడం అబద్దం: రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరైందన్న రేవంత్ రెడ్డి
ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని వ్యాఖ్య
కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి మరీ అప్పులు తీసుకు వచ్చారన్న రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామని చెప్పడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరయిందని, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి మరీ అప్పులు తీసుకు వచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటితో ప్రతి సంవత్సరం రూ.5 వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పినట్లు తెలిపారు.
తెలంగాణ అప్పు రూ.6,71,757 కోట్లు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ. 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు ఉండేదని.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇది దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని మండిపడ్డారు. 2014 లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 100 రోజుల ఖర్చులకు సరిపడా సొమ్ము ఉండేదని భట్టి వివరించారు. ప్రస్తుతం ఇది పది రోజులకు తగ్గిపోయిందని, గత ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలే దీనికి కారణమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, రోజు ఖర్చులకూ రిజర్వ్ బ్యాంక్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెటేతర ఖర్చు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలలో సరిపడా నిధులను ఖర్చు చేయలేదని చెప్పారు. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని వివరించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీ ( తీసుకున్న రుణాలకు) భారం 34 శాతానికి పెరిగిందని తెలిపారు. మరో 35 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. 2014లో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బడ్జెటేతర రుణాలే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.
ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణ కలలన్నీ కల్లలయ్యాయి: మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన మల్లు భట్టి విక్రమార్క
రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేవన్న డిప్యూటీ సీఎం
వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్య
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ శ్వేతపత్రంపై సభలో ఉన్న ప్రతి సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నానని చెప్పారు.
కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషయం అర్థం కావడానికి సమయం పడుతుంది: హరీశ్ రావు
- కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలన్న హరీశ్ రావు
- మీ విజ్ఞతతో సంపదను సమకూర్చుకోండి కానీ, బీఆర్ఎస్‌పై నెపం వేయవద్దని సూచన
- రాష్ట్ర పరపతిని దిగజార్చవద్దని కోరిన హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని… నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్త ముఖ్యమంత్రికి విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందని చురక అంటించారు. కాళేశ్వరం కార్పోరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయలేదని… పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామని స్పష్టం చేశారు. మీ విజ్ఞతతో సంపదను సమకూర్చుకోవాలని.. నెపం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టివేసి తప్పించుకోవద్దని సూచించారు. రాష్ట్ర పరపతిని దిగజార్చవద్దని, భవిష్యత్తును అంధకారం చేయవద్దని కోరారు.
హరీశ్ రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 2014 నుంచి 2016 వరకు హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారని, ఆ తర్వాత కేసీఆర్ వద్ద ఆ శాఖ ఉందని గుర్తు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు వారి కుటుంబం తప్ప మరొకరు చేయలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు మాత్రమే కాదన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్‌కు రూ.97,449 కోట్లు, ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు చేసిందన్నారు. కానీ హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
2014కు ముందు ప్రజలు మంచినీళ్లు తాగలేదా? మీ ప్రభుత్వం వచ్చాకే మంచినీళ్లు తాగినట్లుగా చెబుతున్నారేమిటి? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ వల్ల ఐదువేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి రుణాలు తెచ్చారని మండిపడ్డారు. అప్పులు చేసిన విషయం అంగీకరించకుండా దబాయిస్తున్నారన్నారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పిందని వ్యాఖ్యానించారు.