- వైసీపీ గూడూరు టిక్కెట్ దక్కని నేపథ్యంలో జనసేన అధినేతతో వరప్రసాద్ సమావేశం
- మరోనేత కొణతాల రామకృష్ణ కూడా పవన్‌తో భేటీ
- సీట్ల కేటాయింపుపై సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహించిన జనసేన అధినేత
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. గూడూరు టిక్కెట్‌ను వైసీపీ మేరుగ మురళికి కేటాయించిన నేపథ్యంలో పవన్-వరప్రసాద్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి తిరుపతి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని వరప్రసాద్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, కొణతాల రామకృష్ణ కూడా జనసేన అధినేతతో సమావేశమయ్యారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. 35 సెగ్మెంట్లకు సంబంధించి రివ్యూ పూర్తి చేశారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో సీట్ల ఖరారుపై పవన్ దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై కూడా పవన్ కల్యాణ్ సినీ నటుడు పృథ్వి, జానీ మాస్టర్‌తో చర్చించారు.