Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
  • అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఇరువురు తెలుగుతేజాలు
  • మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం 

అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఐదుగురు వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగువారే కావడం గమనార్హం. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.

పద్మవిభూషణ్ అవార్డుల జాబితా ఇదే..

1. వైజయంతిమాల బాలి (కళలు) – తమిళనాడు
2. కొణిదెల చిరంజీవి (కళలు) – ఆంధ్రప్రదేశ్
3. ఎం. వెంకయ్య నాయుడు (ప్రజా సంబంధాలు) – ఆంధ్రప్రదేశ్
4. బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) (మరణానంతరం) – బీహార్
5. పద్మాసుబ్రహ్మణ్యం (కళలు) – తమిళనాడు

కాగా పద్మభూషణ్‌ కేటగిరీలో తెలుగువారి పేర్లు లేవు. పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే తెలంగాణకు చెందిన ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరి పేరు ఉన్నాయి. ఏపీ నుంచి ప్రముఖ హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆమె దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇక తెలంగాణకు చెందిన వారిలో జనగాం ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్య(చిందు యక్షగానం కళాకారుడు), నారాయణపేట్‌ జిల్లా దామెరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప(బుర్రవీణ కళాకారుడు), తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలను సమకూర్చిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం కృషి చేస్తున్న కేతావత్‌ సోమ్‌లాల్‌, యాదాద్రి సహా పలు ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ స్థపతి వేలు ఆనందాచారి ఈ జాబితాలో ఉన్నారు.

ఎలా స్పందించాలో తెలియడం లేదు.. చిరంజీవి భావోద్వేగం.. !

  • సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన మెగాస్టార్
  • తన ఈ స్థితికి లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణమన్న చిరంజీవి
  • తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనన్న చిరు
  • భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Megastar Chiranjeevi responds after union govt announce Padma Vibhushan

దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. పద్మవిభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసిన తర్వాత చిరంజీవి ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేడు తాను ఈ స్థితిలో ఉన్నానని, తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనని పేర్కొన్నారు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ప్రశ్నించారు. 

తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై భిన్నమైన పాత్రల ద్వారా వినోదం పంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని చిరంజీవి పేర్కొన్నారు. నిజజీవితంలోనూ అవసరమైనప్పుడు సమాజానికి తనవంతు సాయం చేస్తూనే ఉన్నానని తెలిపారు. అయితే, తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి తాను ఇస్తున్నది గోరంతేనని చెప్పుకొచ్చారు. ఈ నిజం తనకు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ప్రతిక్షణం ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు.

పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికవ్వడంపై స్పందించిన వెంకయ్య నాయుడు

  • చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి
  • శ్రేష్ఠ భారత్‌ నిర్మాణంలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తుచేసిందని వ్యాఖ్య
  • పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపిన వెంకయ్య నాయుడు
Venkaiah Naidu says Truly humbled on Padma Vibushan

తనకు పద్మవిభూషణ్ దక్కడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. “నాకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న నాకు ఈ అవార్డు దక్కింది. ‘శ్రేష్ఠ భారత్‌’ నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో నా వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తుచేసింది. దేశంలోని రైతులు, మహిళలు, యువత, నాతోటి పౌరులందరికీ ఈ  పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దాం. మాతృభూమి సేవకు పునరంకితం అవుదాం’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. 

ఇక తనతోపాటు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు  తెలిపారు. తన నటనా పటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలనచిత్ర రంగానికి బహుముఖ సేవలు అందించారని ప్రశంసించారు. పద్మ విభూషణ్ పురస్కారం వరించిన మేటి నటీమణి, భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

మరోవైపు పద్మశ్రీ పురస్కారాలు వరించిన తెలంగాణకు చెందిన ఏవీ ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కే విఠలాచార్యలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగాలలో దేశానికి విశిష్ట సేవ, సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు.

వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు

AP CM YS Jagan Mohan Reddy congratulates Venkaiah Naidu and Chiranjeevi for Padmavibhushan award

పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన వీరిద్దరినీ ప్రశంసించారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీకి చెందిన డి.ఉమా మహేశ్వరిని కూడా సీఎం జగన్ అభినందించారు. కళల విభాగంలో హరికథకుగానూ ఆమె పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వడం ప్రశంసనీయమన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కడంపై స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts to Megastar Chiranjeevi getting Padma Vibhushan award

స్వయంకృషితో జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చేరిపోయారు. స్వయంకృషితో భారత చలన చిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నటనారంగంలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, సినిమాను మనసుపెట్టి చేశారని గుర్తుచేశారు. 


విద్యార్థి నాయకుడి దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగారని పవన్ ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలు అందించారని అన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని, రాజకీయ ప్రస్థానంతో పాటు స్వచ్ఛంధ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు రంగాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైనవారికి కూడా పవన్ అభినందనలు తెలిపారు.

కేటీఆర్,జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు

పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్,  కూరెళ్ల విఠలాచార్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంకయ్యనాయుడు, చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. వారి విజయాలు రాబోయే తరాల్లో స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు.

‘పద్మ విభూషణ్’కు వీరిద్దరూ అర్హులే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says Venkaiah Naidu and Chiranjeevi well deserved for Padma Vibhushan

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

“పద్మ విభూషణ్ అందుకోబోతున్న వెంకయ్యనాయుడు గారికి, చిరంజీవి గారికి అభినందనలు. ప్రజా వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. చిరంజీవి గారు కళా రంగానికి విశిష్ట సేవలందించారు. వీరిద్దరూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పద్మ విభూషణ్ వంటి గొప్ప అవార్డుకు వీరిద్దరూ అర్హులే. తెలుగు ప్రజలు గర్వించే క్షణాలివి” అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Related posts

ఢిల్లీలో ముగిసిన కేంద్రం అఖిలపక్ష భేటీ…

Ram Narayana

బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సింగ్ కన్నుమూత

Ram Narayana

ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్.. ఇవే కాదు.. జూన్ 1 తర్వాత రూల్స్‌లో బోల్డన్ని మార్పులు

Ram Narayana

Leave a Comment