- ఏపీలో మే 13న ఎన్నికలు
- ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల
- ఈ నెల 19న చంద్రబాబు తరఫున కుప్పంలో భువనేశ్వరి నామినేషన్
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎనిమిదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. చంద్రబాబు తరఫున ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 18న ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ మరుసటి రోజు (ఏప్రిల్ 19)న నారా భువనేశ్వరి నామినేషన్ వేయనున్నారు. ఆమె చంద్రబాబు నామినేషన్ పత్రాలను కుప్పంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు.
ముగిసిన నిజం గెలవాలి యాత్ర
కాగా, నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర నేటితో ముగిసింది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరుతో పర్యటనలు చేశారు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల చేయూతనిస్తూ, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించారు.
కాగా, ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో నిజం గెలవాలి యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఇవాళ కూడా పలువురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి, ముగింపు సభకు హాజరయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న ఆ 53 రోజులు ఎలా బతికానో తనకే తెలియదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం బతికే నాయకుడిని జైల్లో పెట్టారని అన్నారు. నిజం గెలవాలి అనే యాత్రను తనకు అప్పగించారని, ఈ యాత్ర ద్వారా అనేకమంది ప్రజలను కలిసే అదృష్టం దక్కిందని భువనేశ్వరి తెలిపారు.