- యవత్మాల్ ఎన్నికల ప్రచార సభలో కిందపడిపోయిన గడ్కరీ
- వెంటనే ఆసుపత్రికి తరలింపు… వైద్యుల పర్యవేక్షణలో కేంద్రమంత్రి
- ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం స్పృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని యవత్మాల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూనే అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. యవత్మాల్ వాశిమ్ లోక్ సభ స్థానం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీఎం ఏక్‌నాథ్ షిండే శివసేనకు చెందిన రాజశ్రీ పోటీలో ఉన్నారు. ఆమె తరఫున గడ్కరీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ కిందపడిపోవడంతో అక్కడ ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. గత కొన్నిరోజులుగా వరుసగా ప్రచారంలో పాల్గొనడానికి తోడు ఎండ, ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గడ్కరీ పదేళ్లుగా నాగపూర్ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.