Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్! బోత్ ఆర్ నాట్ సేమ్… మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

  • రైతులకు ఉచిత పంట బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందని జగన్ ట్వీట్
  • రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పిన పాలన నీదంటూ జగన్‌పై ఆగ్రహం
  • అన్నదాతలకు ఆపన్నహస్తం అందించే ప్రభుత్వం తమది అన్న అచ్చెన్నాయుడు

‘అసమర్థ పాలనా విధానాలతో అన్నదాతలను ఆత్మహత్యల వైపు పురికొల్పిన నిర్లక్ష్య పాలన నీది… అదే అన్నదాతలకు ఆపన్నహస్తం అందిస్తూ విత్తనం నుండి మార్కెట్ వరకు ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే ప్రభుత్వం మాది… బోత్ ఆర్ నాట్ సేమ్ జగన్ (Both are not same)’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత పంట బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందని జగన్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు.

రాష్ట్ర చరిత్రలోనే జగన్ పరిపాలన రైతులకు చీకటి రోజులని విమర్శించారు. సిద్ధం ఫ్లెక్సీల మీద చూపించిన శ్రద్ధ ఏనాడూ రైతుల మీద చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పథకాలు నిలిపివేసి… నీ దిష్టిబొమ్మ వేసిన పాస్ పుస్తకాలు, సమాధి రాళ్ల లాంటి సర్వే రాళ్లు పంపించావని విమర్శించారు. కేవలం ఖరీఫ్‌లో మాత్రమే ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లించి, రబీకి ఏనాడూ ఒక్క రూపాయి ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిన చరిత్ర జగన్‌ది అన్నారు.

జగన్ హయాంలో పెట్టిన బీమా బకాయిలు, బిందు సేద్యం బకాయిలు ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చెల్లించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. అసమర్థ, అరాచక పరిపాలనలో అలాగే అసత్య ఆరోపణల్లో నువ్వు ఒక వర్గానికి ఆదర్శమంటూ చురక అంటించారు. 

‘అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డు పెట్టుకొని పోలీసు బలగాల మధ్య తిరిగిన నువ్వు ఒక్కసారైనా రైతుల మధ్యకు వెళ్లి ఉంటే ఖచ్చితంగా నీకు దేహశుద్ధి చేసి ఉండేవారు.. పంటల బీమా, విత్తనాలు, ఎరువులు, రాయితీపై బిందు సేద్యం, రాయితీపై యంత్ర పరికరాలు, ఉద్యాన పంటల రాయితీ.. వీటిలో ఒక్కటైనా రైతులకు అందించావా? సిగ్గు లేకుండా రాష్ట్రం నుంచి పారిపోయి రాజకీయ డ్రామాలు మొదలు పెట్టావు.. అసెంబ్లీ సమావేశాలకు వస్తే నీ చేతకానితనం స్పష్టంగా నీకు తెలుస్తుంది. అన్నీ లెక్కలతో సహా వివరిస్తాం.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2,384 కోట్ల బకాయిలు పెట్టావు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే బిందు సేద్యం అమలు చేయకుండా కంపెనీలకు 1167 కోట్ల, ధాన్యం బకాయిలు రూ.1600 కోట్లు పెట్టి అన్నదాతలను ఇబ్బందులు పెట్టావు.. కౌలు రైతులకు, మత్స్యకారులను నిర్వీర్యం చేసే పనికిమాలిన చట్టాలు తెచ్చావు.. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి అసలు గిట్టుబాటు ధరే లేకుండా చేశావ’ని  ట్వీట్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తే జగన్ వచ్చి దానిని లక్షకి పరిమితం చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్కో రైతు నెత్తిన రూ 2.75 లక్షల అప్పు మోపిన జగన్ ఇప్పుడు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

Related posts

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్… కాసేపట్లో చంద్రబాబుతో భేటీ!

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్…జానియర్ ఎన్టీఆర్ స్పందించక పోవడంపై ఐ డోంట్ కేర్ అన్న బాలకృష్ణ !

Ram Narayana

అప్పుడు మా వాళ్లు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండదు: జగన్

Ram Narayana

Leave a Comment