- సెబీ చీఫ్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపు
- సెబీ చీఫ్ పూరీ బుచ్‌కు అదానీ గ్రూప్‌తో సంబంధాలున్నాయన్న హిండెన్‌బర్గ్ రిపోర్ట్
- జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్
అదానీ గ్రూపుతో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ ‘హిండెన్‌బర్గ్’ చేసిన సంచలన ఆరోపణల ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో… సెబీ చైర్మన్ పదవికి పూరీ బుచ్ రాజీనామా, స్టాక్ మార్కెట్లకు సంబంధించిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలన్న డిమాండ్లతో ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
తదుపరి జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో ఇవాళ (మంగళవారం) జరిగిన సమావేశంలో ఈ మేరకు పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ విభాగాల చీఫ్‌లు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
‘‘సెబీ, అదానీ కంపెనీ మధ్య సంబంధం ఉందంటూ వెలువడుతున్న షాకింగ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్‌లోని చిన్న మదుపర్ల డబ్బును ప్రమాదంలోకి నెట్టకూడదు’’ అని సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్ మీటింగ్‌కు సంబంధించిన అంశాలను పార్టీ సీనియర్ లీడర్ వేణుగోపాల్ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్‌ను రాజీనామా కోరాలని, విచారణ కోసం జేపీసీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ మేరకు ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించామని వివరించారు.