Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

జేఎన్‌జే స్థలంపై కుట్ర తగదు…

జేఎన్‌జే స్థలంపై కుట్ర తగదు
హైదరాబాద్ : జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచివల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి ఇటీవల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అప్పగించడంపై కొందరు కుట్రదారులు కడుపుమంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని సొసైటీ డైరెక్టర్లు బి.కిరణ్ కుమార్, ఆర్.రవికాంత్‌రెడ్డి, ఎన్.వంశీ శ్రీనివాస్, పీవీ రమణారావు, కె.అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థలాల కేటాయింపును అడ్డుకుంటామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పట్లో స్థలం కొనుగోలుకు సభ్యులు అందిన కాడల్లా అప్పు చేశారని, ఇంకొందరు అప్పు పుట్టక భార్యల మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. కుట్రదారులు వాస్తవాలను దురుద్దేశపూరితంగా విస్మరించి సొసైటీపై విషం చిమ్ముతున్నారని, ఆంధ్ర, తెలంగాణ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రాజకీయ ప్రేరేపిత స్వయం ప్రకటిత సోషల్‌ మీడియా జర్నలిస్టులు చేస్తున్న దుష్ర్పచారాన్ని బుద్ధిజీవులు, విద్యావంతులు, సాధారణ ప్రజానీకం నమ్మవద్దని సొసైటీ డైరెక్టర్లు విజ్ఞప్తి చేశారు.తమ సొసైటీ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సొంతింటి కల నెరవేరిన వేళ…
‘1960ల నుంచి వచ్చిన ప్రభుత్వాలు జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం భూమిని కేటాయించాయి. డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో JNJ MAC హౌసింగ్ సొసైటీకి 70 ఎకరాలు కేటాయించింది. సొసైటీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా (ప్రెస్ ఫొటోగ్రాఫర్‌లు,వీడియోగ్రాఫర్లుసహా) సొసైటీకి కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న వెయ్యి మంది జర్నలిస్టులు ఉన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండి కూడా సభ్యులు రూ. 2 లక్షల చొప్పున 2011లో అప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.12.33 కోట్లను ప్రభుత్వానికి చెల్లించారు. లీగల్‌ ఇష్యూస్‌ కారణంగా స్థలం అప్పగింతలో జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో సొసైటీకి భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టు 2017లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో 32 ఎకరాలను సొసైటీకి అప్పగించింది. మళ్లీ 2022లో మిగిలిన 38 ఎకరాలను అప్పగించాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024లో మా సొసైటీకి మిగిలిన 38 ఎకరాలను అప్పగించింది’ అని పేర్కొన్నారు.

కొందరు అకాల మరణం.. మరికొందరు ఆధారం కోల్పోయి..
జేఎన్‌జే స్థలాల కోసం నిరీక్షించి కుంగిపోయి కొందరు, అనారోగ్యంగా మరికొందరు.. మొత్త 70 సభ్యులు అకాల మరణం చెందారని సొసైటీ డైరెక్టర్లు తెలిపారు. కుటుంబ యజమానిని కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో వీధిన పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి తరువాత చాలామంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు. 16 ఏళ్లు అవిశ్రాంత న్యాయ పోరాటం అనంతరం దక్కిన నోటి కాడి బుక్కను దక్కకుండా చేయాలని కుట్రదారులు చూస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలలో సొసైటీకి వ్యతిరేకంగా విద్వేష ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీల అనుచరులను అధినేతలు కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీ సభ్యులు కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి సహకరించారని, ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా దుప్ప్రచారాన్ని మానుకోవాలని కోరారు.

Related posts

హైదరాబాదులో చాలా ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షం…

Ram Narayana

ఇప్పటిదాకా కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి ‘హైడ్రా’ నివేదిక..!

Ram Narayana

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా!

Ram Narayana

Leave a Comment