పత్తిరైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ …
‘వాట్సాప్’ సేవలు ఉపయోగించుకోండి ..
8897281111 వాట్సప్ నెంబర్ ద్వారా పత్తి అమ్మకం, వివరాలు తెలుసుకోవచ్చు
రాష్ట్రంలో పత్తి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. పత్తిని అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరుగొద్దని ‘వాట్సాప్’ సేవలు ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. పత్తి రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. వాట్సప్ నెంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన వివరాలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిద్ధమైంది. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఈ సేవలను ప్రారంభించింది.
పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రితెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సాప్‌ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులకు తెలిపారు. పింజ రకము(బీబీ మోడ్)క్వింటాకు రూ.7521, (పింజ పొడవు 29.5 నుంచి 30.5(మి. మీ), మైక్రోనీర్ విలువ 3.5 నుంచి 4.3) గా, పింజ రకము (బీబీ ఎస్పీ ఎల్) క్వింటాకు రూ.7471( పింజ పొడువు (మి. మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8) గా, పింజ రకము (మెక్) క్వింటాకు రూ.7421 (పింజ పొడువు (మి. మీ) 27.05 నుంచి 28.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.7) గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు.
పత్తిలో తేమ 12% మించకుండా ఉండాలని, 8% నుంచి 12% మద్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుందని మంత్రి తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుందని, రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి అమ్ముకోవాలనిసూచించారు. పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తుందని, రైతులంతా మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్సాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసాలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరారు. రైతులు ఎటువంటి ఫిర్యాదులు చేసినా మార్కెటింగ్ శాఖ సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.