ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ మీట్ కు ముఖ్య అతిథిగా ఎంపీ వద్దిరాజు
వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూనే సమాజ సేవ కూడా చేస్తే బాగుంటుందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం,సదస్సు నగరంలోని గాయత్రి ఫంక్షన్ హాలులో ఆదివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు కోటి ఇరవై లక్షల వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారని,వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు,ఆపదలో చిక్కుకున్న సందర్భాలలో సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు.కేవలం సంపాదనపైనే దృష్టి పెట్టకుండా అనుకోని విపత్తులు చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొనడం వల్ల అత్మ సంతృప్తి లభిస్తుందన్నారు.డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని,సంబంధిత కేంద్ర మంత్రితో రెండు మూడు సందర్భాలలో సమావేశం కూడా ఏర్పాటు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.ప్రతి ఏటా డీలర్ షిప్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవలసిన అవసరం లేకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేలును మర్చిపోకూడదన్నారు.
వంట గ్యాస్ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకోకుండా సురక్షా పైపులను డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అందజేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వద్దిరాజు చెప్పారు.ఇందుకు కేవలం 50 లేదా 60కోట్లు రూపాయలు మాత్రమే అవుతాయని,ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారం కూడా కాదని సదస్సుకు హాజరైన ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ దృష్టికి తెచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రను అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జగన్మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు,చరణ్, శ్రీకాంత్ తదితరులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు.సదస్సులో మరికల్ పోత సుధీర్ కుమార్, నాగసాయి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఎంపీ రవిచంద్ర సందర్శించారు.