- సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయ సందర్శన
- స్వామివారికి ప్రత్యేక పూజలు
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ పనుల వ్యయం రూ.110 కోట్లు.
ఇక సొంత జిల్లాకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు గతంలో అన్యాయం జరిగిందని అన్నారు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అయ్యారని, కానీ కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు, ప్రాజెక్టులూ రాలేదని విమర్శించారు.
ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని, పాలమూరును సర్వతోముఖాభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు తనను క్షమించరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రుణం తీర్చుకుంటానని… మక్తల్, నారాయణపేట్, కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకువస్తామని అన్నారు.
యువతకు ఉద్యోగ ఉపాధిపై ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని తెలిపారు. గ్రామగ్రామాలకు, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీటీ రోడ్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అన్నారు.