Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మహారాష్ట్ర ఎన్నికలు … రైతుకు రూ 3 లక్షల రుణమాఫీ ప్రకటించిన మహా వికాస్ అఘాడి

  • రూ.3 లక్షల వరకు రైతు రుణ మాఫీ ప్రకటన
  • మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెలా రూ.3000 హామీ
  • నిరుద్యోగ యువతకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ప్రకటన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. ప్రధానంగా 5 హామీలను ప్రకటించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టిసారిస్తామని హామీ ఇచ్చింది. రూ.3 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తామని కూటమి ప్రకటించింది. రుణాలను చెల్లించిన రైతులకు రూ.50,000 సాయం అందిస్తామని పేర్కొంది. 

మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది. లడ్కీ బెహన యోజన కింద ప్రస్తుత ప్రభుత్వం రూ.1,500 ఇస్తుండగా దానిని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. డిగ్రీ లేదా డిప్లొమా చదివిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని పేర్కొంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మహా వికాస్ అఘాడి ప్రకటించింది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి రూ.500లకే ఏడాదికి 6 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని వాగ్దానం చేసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ కారిడార్, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నూతన ఇండస్ట్రీయల్ పాలసీ,  2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొంది.

మహా వికాస్ అఘాడి కూటమి మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల సందర్భంగా మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ పరిమితిని పెంచుతామని ఖర్గే అన్నారు. కుల గణన ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కాదని, వివిధ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలను అందించడమే లక్ష్యమని అన్నారు. 

మహారాష్ట్ర అభివృద్ధికి తమ వద్ద ఐదు స్తంభాలు (5 హామీలు) ఉన్నాయని, ఈ హామీలు మహారాష్ట్రలోని కుటుంబాల అభ్యున్నతికి తోడ్పడతాయని మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి దాదాపు రూ.3.5 లక్షల లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక రాజస్థాన్‌లో మాదిరిగా రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.

Related posts

రామేశ్వరంలోని పురాతన రామనాథ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

Ram Narayana

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు 5 డిమాండ్లు పెట్టిన రెజ్లర్లు.. అవి ఏంటంటే..!

Drukpadam

చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం, దక్షిణ ధ్రువంపై తొలి అడుగు మనదే!

Ram Narayana

Leave a Comment