- కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై పన్నుల పెంపునకు సిద్ధమైన ట్రంప్
- మెక్సికో, కెనడాలపై 25 శాతం… చైనాపై 10 శాతం పన్నుల విధింపు
- ఈ పన్నులు విధించే పత్రాలపై జనవరి 20న సంతకాలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటన
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పన్నులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై పన్నుల పెంపునకు ఆయన సిద్ధమయ్యారు.
మెక్సికో, కెనడాలపై 25 శాతం… చైనాపై 10 శాతం పన్నులు విధించే పత్రాలపై జనవరి 20న సంతకాలు చేయనున్నట్లు సోమవారం ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. చట్ట విరుద్ధమైన వలసలు, మాదక ద్రవ్యాల సరఫరాకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
“జనవరి 20న నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా, మెక్సికో, కెనడా దేశాల నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించడానికి అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తాను” అని ట్రంప్ తన పోస్టులో రాశారు. అలాగే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం పన్ను విధించాలని నిర్ణయించుకున్నట్లు మరో పోస్టులో రాసుకొచ్చారు.
ఇక అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆర్థిక ఎజెండాలో సుంకాలు కీలకమైనవి. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు కూడా. తాను ప్రెసిడెంట్‌గా ఎన్నికయితే వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు విధిస్తానని తెలిపారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.
కాగా, ఈ టారిఫ్ విధానం దేశ అభివృద్ధి, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎకనమిస్టులు హెచ్చరిస్తున్నారు. కానీ, ఈ విధానమే వాణిజ్య భాగస్వాములతో బేరసారాల్లో కీలకమవుతుందని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నమాట.