Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అదానీ దేశం పరువు తీస్తే… జగన్ రాష్ట్ర పరువు తీశారు: షర్మిల!

  • నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన షర్మిల
  • జగన్-అదానీ విద్యుత్ డీల్ పై విచారణ చేయించాలని విజ్ఞప్తి
  • డీల్ రద్దు చేయాలని డిమాండ్ 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి జగన్-అదానీ విద్యుత్ డీల్ పై వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, రూ.1,750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. ఈ విద్యుత్ డీల్… అదానీకి లాభం-రాష్ట్ర ప్రజలకు పెనుభారం అని షర్మిల అభివర్ణించారు. 

ప్రపంచం మొత్తం ఈ ముడుపుల గురించే చర్చించుకుంటోందని, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువుపోయిందని షర్మిల పేర్కొన్నారు. అదానీ దేశం పరువు తీస్తే, జగన్ రాష్ట్ర పరువు తీశారని విమర్శించారు. ఈ స్కాంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని జాతీయ కాంగ్రెస్ కోరిందని, రాష్ట్రంలో కూడా దీనిపై దర్యాప్తు చేయాలని, అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏపీసీసీ డిమాండ్ చేస్తోందని షర్మిల స్పష్టం చేశారు. 

“ఒక యూనిట్ రూ.1.99కి లభ్యమయ్యే విద్యుత్ ను రూ.2.49కి కొనుగోలు చేశారు. ఈ ధరకు అన్ని చార్జీలు కలిపితే ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.5 దాటిపోతుంది. ఈ ధర ప్రకారం పాతికేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారంటే… ఈ తరాన్ని మాత్రమే కాదు, రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్టే… లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టినట్టే! 

ఇదో పెద్ద స్కాం అంటూ నాడు విపక్షంలో ఉన్న టీడీపీ ఆందోళనలు కూడా చేసింది. ఆ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం టీడీపీ ఆ డీల్ గురించి మౌనం దాల్చింది. జగన్-అదానీ డీల్ పై ఎందుకు సైలెంట్ అయ్యారని చంద్రబాబును అడుగుతున్నా. ఎవరికి భయపడుతున్నారు… అదానీకా, మోదీకా? చర్యలకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? అదానీతో ఏమైనా ములాఖత్ అయ్యారా?” అంటూ షర్మిల ప్రశ్నించారు. 

Related posts

షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో ఎక్కడ్నించి పోటీ చేసేదీ చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

Ram Narayana

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటమంతీ!

Ram Narayana

Leave a Comment