తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
- తిరుపతిలో గత రాత్రి తొక్కిసలాట… ఆరుగురు భక్తులు మృతి
- పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు
- నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన సీఎం చంద్రబాబు
- ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
- అనంతరం మీడియా సమావేశం
- డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఆసుపత్రిలో క్షతగాత్రులతో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.
తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ, టీటీడీ సీఎస్ఓ శ్రీధర్ గౌతమిలను బదిలీ చేశారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు తమ నిర్ణయాలు వెల్లడించారు.
తిరుపతి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం… కాంట్రాక్టు ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. నేడు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిప్పులు చెరిగారు. ఘటన స్థలిని స్వయంగా పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన చంద్రబాబు… మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు.
ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు… కీలక నిర్ణయాలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఆరుగురు మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.
తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. వారి ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గాయపడిన మరో 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన 35 మందికి తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. క్షతగాత్రులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భక్తులు తిరుమలలో క్యూలైన్లలో ఉంటే దైవ చింతనలో గడుపుతారని వివరించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచారని, ఎందుకు పెంచారో తెలియదని అన్నారు. ఏదేమైనా, మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిదికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని అభిలషించారు. రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తిరుమల వెంకటేశ్వరస్వామి అంటే ప్రజల్లో భక్తి రోజురోజుకు పెరిగిపోతుందని అన్నారు. పవిత్ర పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవాలన్న భావన ప్రజల్లో అంతకంతకు పెరుగుతోందని తెలిపారు. పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత నాలుగైదేళ్లుగా జరిగిన విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని… ప్రసాదాలు, అన్నదానం, కాటేజీలు… ఇలా అనేక అంశాలను సరిచేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా సామర్థ్యాలు పెంచుకోవాల్సి వస్తే, పెంచుకుంటామని అన్నారు.
ఈవో శ్యామలరావుకో, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికో దీన్ని ఆపాదించలేమని, వాళ్లు ఎగ్జిక్యూటివ్ లుగా, ఈయన చైర్మన్ గా వచ్చారు అని వివరించారు. వాళ్లు వేరే వ్యవస్థల నుంచి ఇక్కడికొచ్చారని, వాళ్లు ఇంతకుముందు ఇలాంటి జాబ్ లు చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే టీటీడీకి విభిన్నమైన కోణాలు ఉన్నాయని… ప్రజల మనోభావాలు, ఇతర సెంటిమెంట్లు ఉన్నాయని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. క్షతగాత్రులకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇవాళ తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వద్దకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారిని అడిగి తొక్కిసలాట వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో బాధపడుతున్న ఆ భక్తులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. భక్తులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
అనంతరం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, బాధితులకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద పార్క్ లో వేచి ఉన్న భక్తుల్లో ఒక మహిళ స్పృహతప్పి పడిపోయిందని… దీంతో, ఆమెను కాపాడేందుకు అక్కడ ఉన్న డీఎస్పీ గేటు తీశారని నివేదికలో పోలీసులు తెలిపారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఫిక్స్ చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో… భక్తులు ఎక్కువగా వస్తున్నారని స్థానిక జర్నలిస్టులు చెప్పినప్పటికీ… అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా… సరైన ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సాయంత్రంలోగా కొందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి నుంచి తిరుపతికి చంద్రబాబు బయలుదేరారు. కాసేపట్లో ఆయన తిరుపతికి చేరుకోనున్నారు.
హ్యూమన్ సైకాలజీ తెలియదా?: టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై చంద్రబాబు ఆగ్రహం
తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న ప్రదేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరకున్న చంద్రబాబు… అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న ప్రమాదస్థలికి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, అనిత, సత్యకుమార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఘటనకు గల కారణాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. టీటీడీ ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, గేటు తీసిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని టీటీడీ ఈవో చెప్పగా… హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలియదా? అని ప్రశ్నించారు. 2 వేల మంది పట్టే స్థలంలో 2,500 మందిని ఎలా ఉంచారని అడిగారు. పరిమితికి మించి భక్తులను ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
విధులు కేటాయించిన పోలీసు అధికారికి ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని ప్రశ్నించారు. ఇంత అధికార యంత్రాంగం ఉండి కూడా టికెట్ల పంపిణీ సరిగా ఎందుకు చేయలేకపోయారని అడిగారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనాస్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ఏమీ జరగక ముందే చర్యలు తీసుకుంటే దాన్ని అడ్మినిష్ట్రేషన్ అంటారని… ప్రమాదం జరిగిన తర్వాత ఎంత చేస్తే మాత్రం ఏం ఉపయోగమని అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. పద్ధతి ప్రకారం పని చేయాలని, పద్ధతి ప్రకారం పని చేయడాన్ని నేర్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా అనుకోవద్దు అని మండిపడ్డారు. బాధ్యత తీసుకున్నవారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసీ.. ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్న చంద్రబాబు
- డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం టెలి కాన్ఫరెన్స్
- ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై అసహనం
- సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని, పునరావృతం కావొద్దని హెచ్చరించారన్న టీటీడీ చైర్మన్
- తొక్కిసలాట ఘటనపై ఉన్నతస్థాయి దర్యాఫ్తు జరపాలన్న పురందేశ్వరి
వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ సందర్భంగా అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమయ్యారంటూ అధికారులపై మండిపడ్డారు. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి జిల్లా అధికారుల ద్వారా ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో ఓ మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు. సీఎం చంద్రబాబు ఈరోజు తిరుపతి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారు.
చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు: చైర్మన్
తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకర ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తిరుమలలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. కొందరు అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారన్నారు. టీటీడీ చైర్మన్ రుయా ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించారు.
ప్రమాద ఘటన నేపథ్యంలో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయ చర్యలు, వైద్య సేవల పర్యవేక్షణ కోసం వారు వెంటనే తిరుపతి వచ్చారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తిరుపతికి వచ్చారు.
తొక్కిసలాట ఘటనపై పురందేశ్వరి స్పందన
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాఫ్తు జరిపి, బాధ్యతారహితంగా వ్యవహరించిన అందరి పైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తొక్కిసలాట ఘటనకు కారణాలు తెలుసుకోవడానికి టీటీడీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో స్పందన ఇలా..!
- పద్మావతి వైద్య కళాశాలలో క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు
- డీఎస్పీ గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట ఘటన చోటుచేసుకుందన్న ఈవో శ్యామలరావు
- విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయన్న ఈవో
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆయన ఈ ఘటనలో 41 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. కొందరిని ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు డిశ్చార్జి చేశారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందుతోందని చెప్పారు.
శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్ల మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే..!
- మూడు రోజులకు 1.20 లక్షల టికెట్ల జారీ
- 13 వతేదీ నుంచి రోజుకు 40 వేల టికెట్లు
- ఏ రోజుకు ఆరోజే ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడి
తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు మూతపడ్డాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తులకు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన కోటా పూర్తికావడంతో కౌంటర్లు క్లోజ్ చేశారు. ఈ నెల 13న తిరిగి వైకుంఠ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజూ 40 వేల టికెట్ల చొప్పున ఏరోజుకు ఆరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడు రోజులకు స్వామి వారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏరోజుకు ఆరోజు టోకెన్లు జారీ చేస్తామని వివరించింది. కాగా, వైకుంఠ దర్శన టోకెన్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం తర్వాత భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ.. గురువారం ఉదయం టోకెన్లను జారీ చేసింది.
తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్ నివేదిక
- కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
- డీఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఘటన
- డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో పేర్కొన్న కలెక్టర్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు. బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించి, పరిహారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు.
డీఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సక్రమంగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని పేర్కొన్నారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట నిలుపుదల చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదన్నారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందజేశారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేసియా ప్రకటించిన ఏపీ సర్కార్
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం
- రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన
- మరికాసేపట్లో రుయా హాస్పిటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన చేశారు.
గురువారం ఉదయం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం నష్టపరిహారాన్ని ప్రకటించారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
కాగా, హోంమంత్రి అనిత, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రుయా హాస్పిటల్‌కు చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాస్పిటల్‌కు చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు. రుయాతో పాటు స్విమ్స్ హాస్పిటల్‌లో కూడా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంచితే, ఈ విషాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన… చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు
- చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయన్న రోజా
- చంద్రబాబు, బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
- పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్న
టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఇప్పుడు తిరుపతిలో అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుందని చెప్పారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు.
సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేకపోయినా ఆయనపై కేసు పెట్టారని… ఈ ఘటనలో చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. సనాతన యోధుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతమంది చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఎక్కడున్నారని అడిగారు. పీఠాధిపతులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తిరుపతి ఘటన ప్రమాదమా… కుట్రా… అనేది విచారణ జరుపుతున్నాం: హోంమంత్రి అనిత
- తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట
- ఆరుగురు భక్తుల మృతి
- మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఏపీ మంత్రుల బృందం
- ఘటనలో ఎవరి వైఫల్యం ఉందో సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్న అనిత
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రుల బృందం ఈ మధ్యాహ్నం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఘటన ప్రమాదమా, లేక ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనేది విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులకు ఎవరి వైఫల్యం కారణం అనేది సీసీ కెమెరా ఫుటేజి ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనకు కారకులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు
- తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద విషాద ఘటన
- తొక్కిసలాటలో పలువురు భక్తుల మృత్యువాత
- తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు
తిరుపతిలో గత రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కులో ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. విష్ణునివాసం వద్ద ఘటనపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం గత రాత్రి 12 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనుండగా… తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద టోకెన్ల కోసం చేరుకున్న భక్తులను సమీపంలోని పద్మావతి పార్కులోకి పంపించారు.
అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో అతడిని పార్కు నుంచి బయటికి తీసుకువచ్చేందుకు సిబ్బంది గేట్లు తెరిచారు. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటికి దూసుకురావడంతో తోపులాట జరిగి ఐదుగురు మరణించారు. మరో భక్తుడు అంతకుముందే విష్ణునివాసం వద్ద అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.
తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్
- తిరుపతిలో నిన్న రాత్రి తొక్కిసలాట
- ఆరుగురు భక్తుల మృతి
- రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బైరాగిపట్టెడ వెళ్లిన పవన్
- అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న వైనం
విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… నేరుగా తిరుపతి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వద్దకు చేరుకున్నారు.
తిరుపతిలో నిన్న రాత్రి పద్మావతి పార్కు వద్ద ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో… పవన్ కల్యాణ్ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డీఎస్పీ చెంచుబాబులతో మాట్లాడారు.
పవన్ కాసేపట్లో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం: తిరుపతిలో పవన్ కల్యాణ్
- తిరుపతిలో తొక్కిసలాట
- ఆరుగురు భక్తుల మృతి
- నేడు తిరుపతి వచ్చి ఘటన స్థలిని పరిశీలించిన పవన్
- అధికారుల తీరుపై ఆగ్రహం
- పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
తిరుపతిలోని బైరాగిపట్టెడ, విష్ణునివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తినాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులు చేసిన తప్పులు ప్రభుత్వాలపై పడుతున్నాయని… తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, ఘటన స్థలి వద్ద ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఘటన స్థలం వద్ద టీటీడీ సిబ్బంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు… అంతమంది ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని అన్నారు. టీటీడీ ఇకనైనా వీఐపీల గురించి కాకుండా, సామాన్య భక్తులపై దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి టీటీడీ సభ్యులు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
ఏదేమైనా గానీ, తిరుపతిలో తప్పు జరిగిందని, అందుకు గాను మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి, శ్రీవారి భక్తులకు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవాళ పవన్ కల్యాణ్ తిరుపతిలో తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు. స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా కలుగుతున్నాయని, పోలీసుల్లో ఎవరైనా కావాలనే ఇలా చేశారా? అని సందేహంగా ఉందని అన్నారు. పోలీసుల అలసత్వంపై ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి వివరిస్తానని తెలిపారు.
తిరుపతిలో భారీ ఎత్తున వచ్చిన భక్తులను నియంత్రించే విధానం సరిగాలేదని, తొక్కిసలాట వంటి ఘటనలు జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా చేపట్టాలన్న దానికి కూడా సరైన ప్రణాళిక లేదని పవన్ విమర్శించారు.
తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు: సీఎం చంద్రబాబు
- తిరుపతిలో తొక్కిసలాట
- తిరుపతిలో చంద్రబాబు ప్రెస్ మీట్
- ఇకనైనా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు
తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగి శ్రీవారి భక్తులు మరణించన వార్త కలచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో బుధవారం నాడు ప్రధానమంత్రి రూ. 2.8 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని, ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఈ విషాద వార్త విని మనసు వేదనకు గురైందని తెలిపారు.
తిరుమల కొండపై ఇంతటి విషాదం జరగడం తనను ఎంతో బాధిస్తోందని, తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు విడిచారని వెల్లడించారు. లావణ్య(విశాఖ), శాంతి(విశాఖ), నాయుడు బాబు(నర్సీపట్నం), రజనీ(విశాఖ), నిర్మల (కోయంబత్తూర్), మల్లిక(మెట్టు సేలం) భక్తులు మరణించారని వివరించారు. వారి ఆత్మకు శాంతికలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
“టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, జేఈవో సహా కొండపై అందరూ సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రతకు భంగం కలిగించకూడదు. పెత్తందార్లుగా కాకుండా సేవకులుగా దేవుని సేవలో పాల్గొనాలి. తిరుమల పవిత్రతను కాపాడతానని మరోసారి చెబుతున్నాము.
45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. 23 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. అక్కడ మరిన్ని జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఉన్న తృప్తి… తిరుపతిలో రాదని భక్తులు అంటున్నారు. గత ఐదేళ్లలో కొండపై చాలా అరాచకాలు జరిగాయి. కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమలకు వచ్చినప్పుడు నేను సామాన్య భక్తుడిగానే ఉంటా. వైకుంఠ ఏకాదశికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
“వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు. తిరుమల పవిత్రతను నిలబెట్టడం ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఈ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. మనం చేసిన పనుల వల్ల దేవుని పవిత్రత దెబ్బతినకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.
రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి సేవ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్రిస్టియన్లు జెరూసలేం, ముస్లింలు మక్కాకు వెళ్తారు. హిందువులు తిరుమల కొండకు వస్తారు. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకం’ అని సీఎం అన్నారు.
తిరుమల లడ్డూని రాజకీయం చేశారు… అందుకే ఇలా జరిగింది: గుడివాడ అమర్ నాథ్
- తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న అమర్ నాథ్
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చెపుతారని ప్రశ్న
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తనదైన శైలిలో స్పందించారు. తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని… మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూని రాజకీయం చేశారని… అందుకే ఇలాంటి విషాదకర ఘటనలు జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని అమర్ నాథ్ చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని చెప్పారు.
ప్రధాని మోదీ భజన మానేసి.. తిరుపతిలో భక్తుల సౌకర్యాల మీద దృష్టి సారించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని అమర్ నాథ్ అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. గతంలో సనాతన ధర్మ దీక్షను చేసిన పవన్… ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామని అన్నారు.
ఏపీకి మోదీ నిన్న ఎలాంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. మెజార్టీ ప్రాజెక్టులన్నీ గతంలో చెప్పినవేనని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమర్ నాథ్ దుయ్యబట్టారు.
తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి: భూమన
- తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి మృతి
- పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విఫలమయ్యారన్న భూమన
- మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కౌంటర్ల వద్ద నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు.
పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందునే తొక్కిసలాట జరిగిందని భూమన ఆరోపించారు. తొక్కిసలాట సమయంలో అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని అన్నారు. టీటీడీ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టీటీడీని ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ విషయంలో జగన్, వైసీపీపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటారని దుయ్యబట్టారు.