- రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందన్న జేపీ నడ్డా
- కాంగ్రెస్‌లో దాపరికం లేదు… చేదు నిజం బయటపడిందని వ్యాఖ్య
- రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేత దేశంపై పోరాటం అనడం విడ్డూరమన్న నిర్మలమ్మ
ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు… దేశంతోనూ కాంగ్రెస్ పోరాటం చేస్తోందని లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ప్రతిపక్షం… దేశంపై కూడా పోరాటం చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరమని, ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బట్టబయలు అయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.
ఇక దాపరికం లేదని, కాంగ్రెస్ చేదు నిజం బయటపడిందన్నారు. ఇది దేశానికి తెలిసిన విషయమే అయినప్పటికీ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్పడం అభినందనీయమన్నారు. రాహుల్ గాంధీకి, ఆయన చుట్టూ ఉన్న వారికి అర్బన్ నక్సల్స్‌తో సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
దేశం పరువు తీయాలని, అప్రతిష్ఠపాలు చేయాలని వారు కోరుకుంటున్నారన్నారు. పదేపదే ఆయన చేస్తున్న పనులు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయన్నారు. దేశాన్ని ముక్కలు చేసి విభజించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంతో చేసిందని, ఇప్పుడు అదే విషయం చెప్పారన్నారు.
దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతోన్న రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రతిపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.