- భవనం వెనకవైపున ఉన్న ఎమర్జెన్సీ మెట్ల మార్గం ద్వారా సైఫ్ ఇంట్లోకి దుండగుడు
- సైఫ్ కుమారులు జే, తైమూర్ గదిలోకి నిందితుడు
- తొలుత గుర్తించిన పనిమనిషి ఎలియామా ఫిలిప్స్
- దుండగుడి చేతిలో ఆమెకు కూడా గాయాలు
- కోటి రూపాయలు డిమాండ్ చేసిన నిందితుడు
- అది చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి సైఫ్‌ను నిద్రలేపిన మరో పనిమనిషి
- సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు
- నిందితుడి కోసం పోలీసు బృందాల వేట
తన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడి కత్తిదాడిలో గాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. నిన్న తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్‌పై కత్తితో దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.
చాలామంది నటులు నివసించే బాంద్రావెస్ట్‌లోని 12 అంతస్తుల భవనంలో భార్య కరీనా కపూర్, కుమారులతో కలిసి సైఫ్ ఉంటున్నాడు. సైఫ్ నివాసం నాలుగు అంతస్తుల్లో ఉంది. సైఫ్ ఇంటిని దోచుకోవాలన్న ఉద్దేశంతో నిందితుడు ఇంటి వెనకున్న మెట్ల మార్గం ద్వారా ప్రవేశించాడు. అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునే మార్గం ద్వారా నిందితుడు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు తెలిపారు.
దొంగను గుర్తించిన పనిమనిషి
తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్స్ అలియాస్ లిమా (56) తొలుత దుండగుడిని గుర్తించింది. వెంటనే అరుస్తూ సైఫ్‌ను అప్రమత్తం చేసింది. మేల్కొన్న సైఫ్ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ తలపడ్డారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు ఆరుసార్లు సైఫ్‌పై కత్తితో దాడిచేశాడు. దుండగుడు వెనక మార్గం నుంచి రావడం, అదే మార్గం నుంచి తప్పించుకోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
సెక్యూరిటీ సిబ్బంది ఏమైనట్టు?
ఈ మొత్తం ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెలబ్రిటీలు ఉండే భవనం వద్ద ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారని, దుండగుడిని వారు ఎందుకు గుర్తించలేకపోయారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సైఫ్‌కు అత్యవసర సర్జరీలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. థొరాసిక్ వెన్నుపాము ప్రాంతంలో అత్యవసర సర్జరీ చేసినట్టు తెలిపారు. అలాగే ఎడమ చేతికి రెండు బలమైన గాయాలు ఉన్నాయని, మెడపైనా కత్తి గాయం అయినట్టు చెప్పారు. వాటికి ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్టు తెలిపారు. నిందితుడిని గుర్తించామని, అతడి కోసం పలు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కోటి రూపాయల డిమాండ్
సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు దాదాపు అరగంట పాటు లోపలే ఉన్నాడు. తొలుత వారి చిన్న కుమారుడు జే గదిని చూశాడు. నిందితుడిని తొలుత చూసిన పనిమనిషి ఎలియామా ఫిలిప్ ఈ ఘటనను వివరిస్తూ.. ‘‘బాత్రూం తలుపు కొద్దిగా తెరిచి ఉండడం చూశాను. అయితే, కుమారుడిని చూసేందుకు కరీనా వచ్చి ఉంటారని అనుకుని నిద్రపోయేందుకు ఉపక్రమించా. అయితే, ఎందుకో అనుమానం వచ్చింది. చెక్ చేసేందుకు వెళ్తే బాత్రూం నుంచి దుండగుడు బయటకు వచ్చి జే, తైమూర్ గదిలోకి వెళ్లడం కనిపించింది. వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో అతడు కోటి రూపాయలు డిమాండ్ చేశాడు’’ అని వివరించారు.
దుండగుడితో ఫిలిప్ తలపడుతుండటాన్ని గమనించిన అదే గదిలో ఉన్న మరో పనిమనిషి లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి సైఫ్‌ను నిద్రలేపింది. సైఫ్ వచ్చేసరికే నిందితుడు ఫిలిప్‌పై దాడిచేసి గాయపరిచాడు. ఆ తర్వాత ఆమెను వదిలి సైఫ్‌పై పడ్డాడు. ఇద్దరూ పోట్లాడారు. ఈక్రమంలో కత్తితో సైఫ్‌పై విచక్షణ రహితంగా దాడిచేసి పరారయ్యాడు.