- ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు ఎదురుదెబ్బ
- ఆధునికీకరించిన స్టార్‌షిప్ రాకెట్ విఫలం
- ఆకాశంలోనే పేలిపోయిన వైనం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ‘స్టార్‌షిప్’ కీలక ప్రయోగం విఫలమైంది. అధునాతన సాంకేతికతతో ఆధునికీకరించి, తొలి టెస్ట్‌గా పేలోడ్ మాక్ శాటిలైట్లను ప్రయోగించగా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గురువారం సాయంత్రం 5.38 గంటల సమయంలో అమెరికాలోని టెక్సస్ నుంచి ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్టార్‌షిప్ ఆకాశంలో ముక్కలుముక్కలైంది.
అప్‌గ్రేడ్ చేసిన స్టార్‌షిప్‌తో స్పేస్‌ఎక్స్ మిషన్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రాకెట్ ప్రోగ్రామ్‌ను మార్చాల్సి ఉంటుందని చెప్పారు. ‘అప్పర్ స్టేజ్’లో సమస్య ఉన్నట్టు అర్థమవుతోందని స్పేస్‌ఎక్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాన్ హుట్ ధ్రువీకరించారు.
రాకెట్ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైతీ రాజధాని పోర్ట్- ఔ-ప్రిన్స్ గగనతలంలో స్టార్‌షిప్ పేలిపోగా నారింజ రంగులో అగ్ని గోళాలు ఎగసిపడ్డాయి. పొగ కూడా వ్యాపించింది. స్టార్‌షిప్ శకలాలు ఆకాశంలో చెల్లాచెదురు కావడంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా విమానాల రాకపోకలపై అప్రమత్తత ప్రకటించారు. విమానాలకు శకలాలు తగిలితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని స్పేస్ఎక్స్ సూచించింది. అటువైపుగా విమానాలు రాకుండా చూసుకోవాలని కోరింది. కాగా, గతేడాది మార్చిలో కూడా స్టార్‌షిప్‌కు ‘అప్పర్ స్టేజ్’ సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు కూడా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.