ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి – మాజీ ఎంపీ నామ డిమాండ్
తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్
సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అనే నినాదం ఇచ్చిన మహానుభావుడు
తెలుగుజాతికి ,కళారంగానికి ఎన్టీఆర్ సేవలు అజరామరం
పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనుడు
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ సీఎం తెలుగు ప్రజల ఆరాధ్య నటులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా కళ రంగం, ప్రజలకు, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ బిఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు ఒక ప్రకటన విడుదల చేసారు. తెలుగు చలనచిత్ర రంగానికి, ప్రజా జీవితానికి, రాజకీయ రంగానికి చేసిన కృషితో పాటు విశ్వమంతటా తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచిన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నామ డిమాండ్ చేసారు. ఈ విషయమై 17వ లోక్ సభ లో తాను పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగిందని ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని గౌరవించినట్లు అవుతుందని నామ తెలిపారు. తనకు ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానం గౌరవం ఉందని నాడు ఎంపీ గా ఎన్నిక కాక ముందు నుండే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎన్టీఆర్ & నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో టీడీపీ పొలిట్ బ్యూరొ సభ్యునిగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటులో తాను పాలుపంచుకోవడంతో పాటు, జిల్లా ప్రజల ఆశీర్వాదంతో మొదటి సారి 15వ లోక్ సభకు ఎన్నిక అయినప్పుడు నాడు పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చేసిన పోరాటంలో సఫలీకృతం అయ్యాను అని నామ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ హయంలో రూ.2కే కిలో బియ్యం పథకం, జనతా వస్త్రాల పంపిణీ, అన్న క్యాంటీన్లు, 5 లక్షల ఇండ్ల నిర్మాణం పథకం, పటేల్ పట్వారీ విధానం రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాలు పేదల అభిమానాన్నిచూరగొనడంతో పాటు వారికి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో భరోసానిచ్చారని పేర్కొన్నారు.