Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

టూరిస్ట్ స్పాట్ గా వెలుగుమట్ల అర్బన్ పార్క్ …మంత్రి తుమ్మల

వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి స్థానిక వెలుగుమట్ల అర్బన్ పార్కును సందర్శించారు. పార్క్ అభివృద్ధి ప్రణాళిక ను మంత్రి పరిశీలించి, పార్క్ లో కలెక్టర్, అధికారులతో కలిసి మొత్తం పార్క్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,  రాబోయే వర్షాకాలం లోపు వెలుగు మట్ల అర్బన్ పార్కును టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని అన్నారు. ఖమ్మం చరిత్ర నేపథ్యంతో ఆకర్షణీయంగా ఉండే విధంగా వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు మంచి పేరు పెట్టాలని అన్నారు.

ఖమ్మంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాలలో కూడా అర్బన్ పార్క్ ల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సహజ సిద్ధంగా అటవీ ప్రాంతాలు ఉండటం మన సంపదని, జిల్లా కలెక్టర్, డి.ఎఫ్.ఓ మంచి కార్యక్రమాలు తీసుకుంటు ముందు కెళ్తున్నారని, కష్టపడి, మనస్సు పెట్టే అధికారులు ఉన్నప్పుడూ, వీరికి సహకరిస్తూ అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు.

వెలుగు మట్ల అర్బన్ పార్కుకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, కొంత మంది అనాలోచితంగా తమ భూమి సెంటు, గజం పోతుందని ఆందోళన చెందుతున్నారని, ప్రస్తుతం ఉన్న భూమి విలువ కంటే రోడ్డు వేసిన తర్వాత 10 రెట్లు పెరుగుతుందని అన్నారు. రోడ్డు బాగుంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు.

వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద ప్లాస్టిక్ వాడకం నిషేదించాలని, ఇక్కడ క్యాంటీన్ లో కూడా చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను పెట్టాలని, స్వశక్తి మహిళా సంఘాలచే స్టాల్ ఏర్పాటు చేయాలని అన్నారు.

వెలుగుమట్ల అర్బన్ పార్క్ సంబంధించిన భూమి బౌండరీ ఫెన్సింగ్ చేయాలని అన్నారు. ఫెన్సింగ్ లోపల చుట్టూ రోడ్లు, చెక్ డ్యాంలో నీరు అందుబాటులో ఉండాలని అన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి పాత్రికేయులు కూడా సహకరించాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, రాబోయే తరాలను పార్క్ కు తీసుకొని వచ్చి ప్రకృతిని కాపాడుతూ, అభివృద్ధి సాధించడం ఎలా అనే అంశం తెలియజేసేలా పార్క్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దానిని నివారించేందుకు పార్క్ అభివృద్ధి చేపట్టామని, గత రెండు నెలలుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అర్బన్ పార్క్ ను సందర్శిస్తున్నారని, ఇక్కడి అంశాలు కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఖమ్మం నగరానికి పది నిమిషాల దూరంలో 500 ఎకరాలలో పార్క్ ఉండటం అదృష్టమని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఈ పార్క్ లు ఉపయోగమని అన్నారు. ప్రతి రోజు ప్రస్తుతం వేయి మంది వరకూ సందర్శకులు వస్తున్నారని, పిల్లలకు అడ్వెంచర్ గేమ్స్ మరిన్ని మౌళిక వసతులు కల్పిస్తే భవిష్యత్తులో రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది, వారాంతాలలో 6 వేల వరకూ సందర్శకులు వచ్చే అవకాశం ఉందని, దీనికి వల్ల స్థానిక ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి సాధించాలని సందేశం ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ వంటి పండుగల ద్వారా మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉందని, దానిని మనం నిరంతరం పాటించాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, 1977 లో 546 ఎకరాలకు అర్బన్ పార్క్ నోటిఫికేషన్ జరిగిందని అనంతరం భూ పోరాటంలో భాగంగా చాలా వరకు భూమి కోల్పోయామని, 2016లో మంత్రివర్యుల హయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జాయింట్ సర్వే చేసి, దాదాపు 250 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

గత సంవత్సరం నుంచి మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధతో ఫాలో అప్ చేస్తూ టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నుంచి 3 కోట్లు మంజూరు చేసి ఇక్కడ బోటింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కోటి 28 లక్షల హరిత నిధి నుంచి పార్కుకు మంజూరు అయ్యాయని, ఇక్కడ జింకల పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వారంలో 5 నుంచి 6 పాఠశాలల నుంచి విద్యార్థులు సందర్శనకు వస్తున్నారని అన్నారు.

గతంలో నెలకు 50 నుంచి 60 వేల ఆదాయం వస్తే ప్రస్తుతం నెలకు 2 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని అన్నారు. పార్క్ వద్ద సోలార్ పార్కింగ్ ఏర్పాటు చేశామని, యోగా షెడ్ వద్ద కూడా రూఫ్ పై సోలార్ ప్యానేల్ ఏర్పాటు చేశామని అన్నారు.పార్క్ వద్ద ప్లాస్టిక్ వాడకం నివారణ ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, శిక్షణ ఐపీఎస్ రుత్విక్ సాయి, డిఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాయల నాగేశ్వరరావు నివాసానికి పొంగులేటి …

Ram Narayana

రఘునాథపాలెం మండలానికి మహర్దశ మంచుకొండ ఎత్తిపోతల పథకం…మంత్రి తుమ్మల

Ram Narayana

రాయల చంద్రశేఖర్ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు …పలువురు నివాళులు

Ram Narayana

Leave a Comment