- వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.
బడ్జెట్ హైలైట్స్:
- మొత్తం బడ్జెట్ – రూ. 3.22 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
- మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
- రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
- ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు
- వ్యవసాయానికి – రూ. 48 వేల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,705 కోట్లు
- అన్నదాత సుఖీభవకు – రూ. 6,300 కోట్లు
- పాఠశాల విద్యకు – రూ. 31,805 కోట్లు
- ఉన్నత విద్యకు – రూ. 2,506 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ. 1,228 కోట్లు
- బీసీ సంక్షేమానికి – రూ. 47,456 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి – రూ. 20,281 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి – 8,159 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ. 5,434 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖకు – 18,847 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ. 13,862 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు – రూ. 6,318 కోట్లు
- జలవనరుల శాఖకు – రూ. 18,019 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం – రూ. 4,332 కోట్లు
- ఆర్ అండ్ బీ కి – రూ. 8,785 కోట్లు
- ఇంధన శాఖకు – రూ. 13,600 కోట్లు
- తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ. 10 కోట్లు.
ఏపీ బడ్జెట్… హైలైట్స్ – 2

- తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ. 27,518 కోట్లు
- తల్లికి వందనం పథకానికి రూ. 9,407 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వ్యవసాయం, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు.
బడ్జెట్ హైలైట్స్:
- దీపం 2.0 పథకానికి – రూ. 2,601 కోట్లు
- తల్లికి వందనం కోసం – రూ. 9,407 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు – 3,806 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ. 13,487 కోట్లు
- జల్ జీవన్ మిషన్ కు – రూ. 2,800 కోట్లు
- మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ. 10 కోట్లు
- మత్స్యకార భరోసాకు – రూ. 450 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ. 3,486 కోట్లు
- ఆదరణ పథకానికి – రూ. 1,000 కోట్లు
- ఆర్టీజీఎస్ కోసం – రూ. 101 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు – రూ. 27,518 కోట్లు
బాబు సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ లో పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో కూటమి సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేసింది. సూపర్ సిక్స్ హామీలు, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. ఈ కారణంగా వార్షిక బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకునేందుకు బడ్జెట్ లో రూ.6300 కోట్లు కేటాయించారు. ఇక, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడేందుకు ఉద్దేశించిన తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలు చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఏటా రూ.15 వేలు ప్రభుత్వం జమచేయనుంది.
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. ప్రతీ కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూ.25 లక్షల బీమా సదుపాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. మరమగ్గాలపై ఆధారపడే చేనేత కుటుంబాలకు 500 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు దీపం 2.0 పథకం కింద నిధుల కేటాయింపు జరిపామని మంత్రి పయ్యావుల కేశవ్ సభలో పేర్కొన్నారు.
కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్: సీఎం చంద్రబాబు

- ఏపీ బడ్జెట్ ప్రకటించిన ఆర్థికమంత్రి పయ్యావుల
- అసెంబ్లీ హాల్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
- సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు
- గ్రూపులు కడితే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్
బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కు రూపకల్పన చేశామని అన్నారు. గత వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని తేల్చి చెప్పారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేదని, గ్రూపులు కడితే సహించేది లేదని హెచ్చరించారు.
