- మందబలంతో అసెంబ్లీని నడుపుతామంటే కుదరదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- పద్ధతీ పాడు లేకుండా సభ నడిపిస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి
- తన సస్పెన్షన్ కు సంబంధించి బులెటిన్ ఇవ్వాలని డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను మందబలంతో నడుపుతామంటే కుదరదని ఆయన హెచ్చరించారు. తనను సభ నుంచి సస్పెండ్ చేశామని చెబుతున్న స్పీకర్.. దీనికి సంబంధించి బులెటిన్ ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. బులెటిన్ ఇవ్వకుండా సస్పెండ్ చేశాం సభకు రావద్దని అనడం ఏంటని నిలదీశారు. ఏ కారణంతో తనను సస్పెండ్ చేశారో వివరిస్తూ బులెటిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘ఓ పద్ధతీ పాడూ లేకుండా సభను నడిపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా జరిపిస్తున్నారు. నన్ను సస్పెండ్ చేశామంటున్నారు కానీ కారణం చెప్పడంలేదు, బులెటిన్ ఇవ్వలేదు. మరి నన్నెలా అడ్డుకుంటారు? సస్పెన్షన్ కు సరైన కారణంలేదు కాబట్టి బులెటిన్ ఇవ్వలేదు. ఇస్తే నేను ఎక్కడ కోర్టుకు వెళతానోనని భయపడుతున్నారు’ అంటూ జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అదేసమయంలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, మంత్రులపై జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కారులో కేవలం గంట ప్రయాణానికి కూడా మంత్రులు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జాన్ పహడ్ లో ఆదివారం జరిగిన ఓ దావత్ కు జానారెడ్డి హెలికాప్టర్ లో వచ్చారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.