CM Revanth Reddy
ఖమ్మం వార్తలుతెలంగాణ వార్తలు

సన్న బియ్యంతో … సీఎం సారుకు సామాన్యుడి విందు

  • పరవన్నం, పప్పు, గోంగూర చెట్నీ, సాంబారు, పెరుగుతో భోజనం
  • లబ్దిదారుడు బూరం శ్రీనివాస రావు ఇంట్లో భోంచేసిన సీఎం రేవంత్ రెడ్డి  
  • కృతజ్ఞతగా లబ్దిదారుని కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో భోంచేశారు. ఆదివారం భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఆయన, మధ్యాహ్నం నేరుగా సారపాకలోని తాళ్ల గొమ్మూరుకు చెందిన గిరిజనుడు బూరం శ్రీనివాస రావు, రాధ దంపతుల ఇంటికి వెళ్లారు. వారు రేవంత్ రెడ్డికి హారతి ఇచ్చి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో వండిన అన్నం తిన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, లబ్దిదారుడు శ్రీనివాస రావు దంపతులతో కలిసి భోంచేశారు. పరవన్నంతో పాటు రైస్, పప్పు, గోంగూర చెట్నీ, సాంబారు, మెరుగు, మజ్జిగతో లబ్దిదారుని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి భోజనం వడ్డించారు. వంటలు బాగున్నాయన్న రేవంత్ రెడ్డి, కొద్ది సేపు వారితో మమేకమై ఆప్యాయంగా మాట్లాడారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బసు ప్రయాణం వంటి పథకాలు అందుతున్నాయా ? అని అడిగారు. అన్నీ అందుతున్నాయని, పేదలకు ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం ఆనందంగా వుందని శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు చెప్పడంతో, సీఎం రేవంత్ రెడ్డి సంతోషించారు. అనంతరం, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావు కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ భోజనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆద్యంతం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దగ్గరుండి చూసుకున్నారు. భోజనం తయారు చేయడానికి ముందే తుమ్మల, లబ్దిదారుడు శ్రీనివాస రావు ఇంటికి వెళ్ళి భోజన పదార్ధాలను పరిశీలించారు. వంటకంలో వారికి తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీనివాస రావు ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. రేవంత్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ అక్కడి నుండి వెళ్ళి పోయారు. ఈ పర్యటనలో తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు ఘన స్వాగతం లభించింది. సారపాకలోని బీపీఎల్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వారు చేరుకోగానే, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ఎమ్మేల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పుష్ప గుచ్చాలతో ఎదురేగి స్వాగతం పలికారు. అక్కడ నుండి ఐటీసీ అతిధి గృహానికి చేరుకున్న రేవంత్ రెడ్డి దంపతులు, కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, భద్రాచలం చేరుకున్నారు. అక్కడ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత, రాములోరి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియానికి వచ్చారు. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 2000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంత మంది న్యూడెమోక్రసీ, మాస్ లైన్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు.

Related posts

గ్రూప్ వన్ పరీక్షలు ముందుకు వెళ్ళేవి కావు …ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుమానం …

Ram Narayana

యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు…

Ram Narayana

చంద్రబాబును ఆదర్శంగా తీసుకోండి…రేవంత్ రెడ్డికి మంద కృష్ణ సలహా ..

Ram Narayana