- వన జీవి భౌతిక కాయాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల
- కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి
పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో అందరం మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపు నిచ్చారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డి పల్లిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, రూరల్ తహసిల్దార్ రాం ప్రసాద్ తో కలిసి రామయ్య భౌతిక కాయానికి ఆయన పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రామయ్యతో తనకు1994 నుంచి విడ దీయరాని బంధం ఏర్పడిందని చెప్పారు. చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వన జీవి రామయ్య ధరిత్రికి ముద్దు బిడ్డని కొనియాడారు. ఇంటి పేరునే వన జీవిగా మార్చుకున్న పద్మశ్రీ దరిపల్లి రామయ్య మృతి దేశానికీ తీరనిలోటన్నారు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య, ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారని కొని యాడారు. తన మనవరాళ్లకు సైతం మొక్కల పేర్లు పెట్టుకున్న నిజమైన ప్రకృతి ప్రేమికుడు రామయ్య అంటూ ప్రశంసించారు. పర్యావరణ హితం కోసం రామయ్య అను క్షణం పరితపించాడని తుమ్మల పేర్కొన్నారు. ప్రతి క్షణం సమాజం కోసం పర్యావరణ పరి రక్షణ కోసం పని చేశాడని చెప్పారు. అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలోనూ మొక్కల పెంపకం సంరక్షణ పైనే ఆలోచించారన్నారు. పలు మార్లు తాను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సమయంలో సైతం మొక్కల పెంపకం సంరక్షణ పైనే మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాదులో రామయ్య చికిత్స పొందుతున్న సమయంలో పరామర్శించానని, రామయ్య తన జీవితాన్ని ప్రకృతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారని తుమ్మల పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం దుర దృష్టకరమని, రామయ్య నేటి సమాజానికి ఆదర్శనీయమని అన్నారు.

గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయాం : ఎంపీ రఘురాం రెడ్డి
తన జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం దార పోసి కోటి మొక్కలు నాటిన వన జీవి రామయ్య వంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోవడం చాలా బాధాకరమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి రెడ్డిపల్లిలో రామయ్య భోతిక కాయం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ వన జీవి రామయ్య తపనంతా మొక్కలు పెంచడం, సంరక్షించడమేనని కోటికి పైగా మొక్కలు నాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మరణించేంత వరకు వన సంరక్షణే ధ్యేయంగా శ్రమించి భావితరాలకు స్ఫూర్తి నింపారని అన్నారు. అలాంటి మహానుభావుడి మృతి రాష్ట్రానికే కాదు, యావత్తు దేశానికే తీరని లోటన్నారు. రామయ్య మరణను ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని, కలెక్టర్, జెసీలకు తెలిపి ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. ఆయన వెంట మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాధ బాబు, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్ర శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మారెమ్మ దేవస్థానం చైర్మన్ టీ. వీరా రెడ్డి, కానుగుల రాధాకృష్ణ, పంతులు నాయక్, రామ్మూర్తి నాయక్, లింగాల రవి కుమార్, కార్పొరేటర్ నిరంజన్, సీపీఐ నేత మౌలానా, బోడా వెంకన్న, పాపా నాయక్, మొగిలిచర్ల సైదులు తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ తాతా మాదు సూదన్ దిగ్భ్రాంతి
వన జీవి రామయ్య అకాల మరణం పట్ల ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పద్మశ్రీ వన జీవి రామయ్య ప్రకృతి ప్రేమికుడిగా, వన్య ప్రాణుల పరిరక్షణకు అంకితమై, సమాజానికి ఎంతో సేవలందించిన గొప్ప వ్యక్తని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశకాలు కావడమే కాకుండా, ప్రకృతి పరిరక్షణ కర్తవ్యాన్ని తెలియ జేసే సూచికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.