- పాలకులకు రైతులతో మాట్లాడే తీరిక లేక పోవడం దారుణం
- కాంగ్రెస్ అధినాయకుల కేసులపై కూడా సీఎం స్పందించడం లేదు
- కమ్యూనిస్తులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు
- రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఖమ్మం వచ్చిన ఆమె ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ధాన్యం బస్తాల్లో మొలకెత్తుతుంటే, మామిడి రాలి పోయి రైతులు ఇబ్బంది పడుతుంటే, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కన్నీరు కారుస్తుంటే, కనీసం ఒక మాట మాట్లాడి, రెవెన్యూ అధికార్లతో సమీక్ష జరిపి, నష్టాన్ని అంచనా వేయలేని ప్రభుత్వం రాష్ట్రంలో వుండడం నిజంగా మన దౌర్భాగ్యమన్నారు. ఖమ్మంలో బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఉన్నా , ఇప్పటికీ జరిగిన నష్టంపై రైతులతో మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ముగ్గురు మంత్రులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించాలన్న ప్రయత్నంలో వున్నారు తప్ప, ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన వారికి లేక పోవడం నిజంగా దారుణమన్నారు. కమ్యూనిస్తులు కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయక పోవడం విచార కరమన్నారు. కమ్యూనిష్టులు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్ గా వుంటారన్న అభిప్రాయం దేశ వ్యాప్తంగా వుందన్నారు. అధికారంలో ఎవరున్నా ప్రజల తరుపున వీళ్ళన్నా ప్రశ్నిస్తారన్న ఒక నమ్మకం వుందని, కానీ ఇవ్వాళ ఖమ్మం జిల్లాలో ఆ నమ్మకం వమ్మయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వున్న కమ్యూనిష్టు నేతలే ప్రభుత్వంలో వున్నందుకే ప్రశ్నించడం లేదని భావించాల్సి వస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ఇక్కడ భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగు నీరందించామని చెప్పారు. కానీ, ఇవ్వాళ్ళ 15, 16 నెల్లయినా ఒక కొత్త పథకం లేదు, ఒక కొత్త ఆలోచన కూడా లేదన్నారు. ఎంత దారుణమంటే, నిన్నగాక మొన్న, కాంగ్రెస్ అధినాయకులు సోనియా, రాహుల్ గాంధీలపై ఏ1, ఏ2 కేసులు పెడితే, మన ముఖ్యమంత్రి జామ్ జామని జపాన్ లో పర్యటన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తే. సీఎం ఒక ట్వీట్ లేదు, ఒక పోస్ట్ లేదని, జపాన్లో ఇంటర్నెట్ పని చేయడం లేదేమో తనకు తెలియదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని తెలుసుకొనే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. తాము అధికారంలో వున్నప్పుడు, కేసీఆర్ ఎప్పటికప్పుడు రైతుల పరిస్థితిని తెలుసుకొనే వారని చెప్పారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. రైతు భరోసా ఇంకా సగం మందికి రాలేదని, 60 శాతం మంది రైతులకు ఋణ మాఫీ జరగ లేదని చెప్పారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలే కావడం లేదన్నారు. ఇంత వరకు ఏ ఒక్కరికీ ఈ పథకం క్రింద డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలకు కోల్పోయిందని, రాష్ట్రం తిరో గమన దిశలో నడుస్తుందని అన్నారు. సమస్యలపై ప్రజలు ఎక్కడికక్కడ పాలకులను నిలదీయాలని, నిలదీసే ప్రతిపక్షానికి అండగా వుండాలని కోరారు. ఈ నెల 27న వరంగల్లులో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు.