- రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి భవిష్యత్ పోరాటాలకు వేదిక కానున్న ఖమ్మం
- రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు, అతిథులుగా ప్రముఖుల హాజరు
- విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈనెల ఎప్రిల్ 25 నుండి27వరకు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగనున్నాయని, ఈ మహాసభలను ఖమ్మం జిల్లా విద్యార్ధి లోకం జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు కోరారు. ఖమ్మం సుందరయ్య భవనంలో ఆయన ఖమ్మం జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షుడు డి.వెంకటేష్ లతో విలేకర్లతో మాట్లాడారు. ఖమ్మంలో 2002 తర్వాత రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహా సభల్లో 33 జిల్లాల నుండి10 రాష్ట్ర యూనివర్శీటీలు, 6సెంట్రల్ యూనివర్శీటీల నుండి 600 మంది విద్యార్ధి ప్రతినిధులు 3రోజుల పాటు పాల్గోంటారని తెలిపారు. మొదటి రోజు 25న ఉదయం 11:00 గంటలకు జడ్పీ సెంటర్ నుండి వేలాది మందితో ప్రదర్శన ప్రారంభం అవుతుందని, అనంతరం భక్త రామదాసు కళా క్షేత్రంలో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభలో ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు వి.పి.సాను, సినీ నటుడు మాదాల రవి, ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాస రావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు తదితరులు పాల్గోంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్ గత ఆరేళ్ళ నుండి ఇవ్వడం లేదని తక్షణమే వాటిని విడుదల చేసేలా ప్రభుత్వంపై పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. కాంగ్రెస్ విద్యా రంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సరం చేస్తోందని వాటి గురించి మహాసభలో చర్చిస్తామని పేర్కొన్నారు. కేంద్రం నూతన విద్యా విధానం పేరుతో విద్యాకేంద్రీకరణ చేస్తోందని, నూతన విద్యా విధానం అమలు చేస్తూ విద్యా విధానాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ చేసే పోరాటాల్లో విద్యార్థులు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్ట మొదటి సారి ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు ప్రాతినిధ్యం ఇస్తోందని ఈ మహాసభలను ఖమ్మం జిల్లా విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు విజయవంతం చేయాలని, 25వ తేదీన నిర్వహించే ర్యాలీ బహిరంగ సభలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. విలేకర్ల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దొంత బోయిన వెంకటేష్, నాయకులు వినోద్, లోకేష్, త్రినాథ్, సుశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.