Thammineni Veerabhadram
తెలంగాణ వార్తలు

ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఆపరేషన్ కగార్

  • వెంటనే నిలిపి వేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని డిమాండ్

మధ్య భారత దేశంలోని అడవులలో ఉన్న అపారమైన సహజ వనరులను, విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను ఎంచుకుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి.రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను, మావోయిస్టుల పేరుతో ఆదివాసీల పైన తీవ్రమైన అణచి వేత చర్యలకు తెగబడుతూ చివరికి హత్యలు చేస్తోందని ద్వజ మెత్తారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టుల పేరు మీద ఆదివాసీలపై జరుపుతున్న అమానుష దాడులను ఆపి వేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలం నుండి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేస్తామంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై దాడులు చేస్తోందని విమర్శించారు. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టుల నుంచి రెండుసార్లు ప్రతిపాదనలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోకుండా అణిచి వేత చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. పౌర సమాజంలోని అనేక మంది మేధావులు, పౌరహక్కుల నేతలు శాంతి చర్చలకు తాము ఇరు వైపుల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని చెప్పినా, కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం సరైనది కాదని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలలోని ప్రతి పక్ష పార్టీలు సైతం శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పు పట్టారు. వేల మంది పారా మిలటరీ బలగాలను కర్రెగుట్టల చుట్టూ మోహరించి, ఆదివాసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తూ మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ప్రకటనలు చేయడం ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రక్తపాతాన్ని ఆపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నా రు. అలా జరగక పోతే తాము దేశంలోని ప్రజాస్వామిక శక్తులను, వామపక్ష ప్రతిపక్ష పార్టీలను, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, సీనియర్ నాయకులు సుబ్బారావు, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, షేక్ బషీరుద్దీన్, పిన్నింటి రమ్య,  నాయకులు  ప్రకాష్ ,టీ  నరసయ్య, డా.భారవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ‌లో 65 ఏళ్లు నిండిన అంగ‌న్‌వాడీ సిబ్బందికి విశ్రాంతి…

Ram Narayana

రాష్ట్రంలో జర్నలిస్టులకు 44 వేల అక్రిడిటేషన్ కార్డులు…మంత్రి పొంగులేటి…

Ram Narayana

కేంద్రం గుడ్‌న్యూస్… మెహిదీపట్నం స్కైవాక్ కోసం స్థలాన్ని అప్పగించనున్న రక్షణ శాఖ

Ram Narayana