Mallu Bhatti Vikramarka
తెలంగాణ వార్తలు

తిరిగి దొరల పాలన తెచ్చేందుకు … దోపిడి దారులంతా ఏకమవుతున్నారు

  • తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపణ
  • కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ద్వజం
  • అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు కనపడట లేదా ? అంటూ ప్రశ్నల వర్షం
  • మీ నలుగురు కుటుంబ సభ్యుల్లా సంపదను దోచుకు తిన లేదని ఎద్దేవా
  • రాష్ట్ర సంపదను 4 కోట్ల మంది ప్రజలకు పంచుతామని వెల్లడి  
  • ఈ నెల 18న ఇందిర సౌర జల వికాస పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటన  

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వాన్ని అల్లరి, అబాసు పాలు చేసి, తిరిగి దొరల పాలన తీసుకొచ్చేందుకు దోపిడి దారులంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. అటువంటి దోపిడి దారుల మాటలు నమ్మొద్దని భట్టి ప్రజలను కోరారు. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని కాంక్షించే ఇందిరమ్మ పాలనే మెరుగైన పాలననని ఉద్ఘాటించారు. శనివారం ఆయన అశ్వారావుపేట నియోజకవర్గంలోని పరకాల గండిలో రూ. 2.24 కోట్లతో, అచ్యుతా పురంలో రూ. 3.10 కోట్లతో, తిరుమల కుంటలో రూ. 3.15 కోట్లతో, కావడి గుండ్లలో రూ. 2.24 కోట్లతో,  అశ్వారావు పేట పట్టణంలో రూ. 2.53 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ. 24.46 కోట్ల అంచనా వ్యయంతో 33 కేవీ ఫీచర్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అశ్వారావు పేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ వరంగల్ బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలపై మండి పడ్డారు. పదేళ్ళు మీరు రాష్ట్ర సంపదను, ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు చేసిన రూ. 7.50 లక్షల కోట్ల అప్పులు తీరుస్తూ, పెద్ద ఎత్తున అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో ఏడాదిన్నర ఫామ్ హౌస్ లో పడుకొని, ఇప్పుడు బయట కొచ్చి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాశన మవుతుందనడానికి సిగ్గు లేదా ? అంటూ విరుచుకు పడ్డారు. రాష్ట్ర సంపదను మీ నలుగురు కుటుంబ సభ్యులు దోచుకు తింటే, మేము ప్రజలపై రూపాయి భారం మోప కుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంపదను పంచుతున్నామని భట్టి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే, అప్పుల పాలు చేసింది మీరు కాదా ? అంటూ ద్వజ మెత్తారు. మాట్లాడితే, ప్రజలకు తాము అన్యాయం చేశామంటున్నారు, ఏం అన్యాయం చేశామని ప్రతి పక్ష పార్టీ నేతలను నిలదీశారు. పదేళ్ళు అధికారంలో వుండి, మీరు ప్రజలకు చేసిన న్యాయ మేంటని ప్రశ్నించారు. మీ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ళు ఏమైనా ఇచ్చారా ? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాటను నిల బెట్టుకున్నారా ? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, ఇచ్చారా ? ప్రతి మండలంలో మూడింటికి తగ్గకుండ, ఎల్కేజీ టూ పీజీ విద్యా సంస్థలను కడతానన్నారు, కట్టారా ? అన్ని నియోజక వర్గాల్లో లక్ష ఎకరాలకు తగ్గ కుండ సాగు నీరందించేందుకు ప్రాజెక్టులు పెడతామన్నారు, పెట్టారా ? పోనీ పరిశ్రమలేమైనా తెచ్చారా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయ కుండా, తెచ్చిన అప్పులతో ప్రాజెక్టులు కట్ట కుండా, కట్టక కట్టక ఒక కాళేశ్వరం కట్టి లక్ష కోట్ల రూపాయలు గోదాట్లో పోశారని విమర్శించారు. అక్కడ ప్రాజెక్టు కట్టొద్దని చెప్పినా వినకుండ, ప్రాజెక్టు కట్టి దేనికీ పనికి రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాష్ట్ర సోమ్మంతా కాజేసీ, రాష్ట్రాన్ని దివాళా తీయించి, ఇప్పుడు తగుదునమ్మా అంటూ పెద్ద ఎత్తున అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వంపైనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 22,500  కోట్లతో ప్రతి నియోజక వర్గంలో 3,500 ఇళ్ళకు తగ్గకుండా, ఒకే సంవత్సరం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తున్నామని భట్టి చెప్పారు. ఏడాదిలో నిరుద్యోగులకు 57 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, 30 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రాసెస్ మొదలు పెట్టామన్నారు. అంతే కాకుండా, 9 వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాస్ పథకం క్రింద 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ఏడాది స్వయం ఉపాధి కల్పించేందుకు ధరఖాస్తులు స్వీకరించామన్నారు. అర్హులైన వారందరికీ జూన్ 2న శాంక్షన్ లెటర్స్ అందజేస్తామన్నారు. ఇప్పటికే, రైతులకు రూ. 21,560 కోట్లతో రుణ మాఫీ చేశామని చెప్పారు. మరో రూ. 1970 కోట్లతో రైతులకు ఇన్సూరెన్స్ కూడా చేశామని తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. రూ. 13, 000  కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అంతే కాకుండా, డ్వాక్రా సంఘాలకు ఏడాదికి రూ. 20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు మహిళల ఆర్ధిక శక్తిని పెంచేందుకు బస్సులు ఇస్తున్నామని, టీ కాంటీన్లు, సోలార్ పరిశ్రమలు పెట్టిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో 25 ఎకరాలకు తగ్గకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిరెన్సియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. హాస్టల్ విద్యార్ధులకు 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు.  రాజీవ్ ఆరోగ్య శ్రీ క్రింద 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. గిరిజన రైతులకు తోడ్పాటు నందించేందుకు రూ. 12 , 500 కోట్లతో ఈ నెల 18న ఇందిర సౌర జల వికాస పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజక వర్గంలో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనగా ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత, అన్ని నియోజక వర్గాల్లో ఒక ఉద్యమంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం క్రింద సోలార్ పంపు సెట్లు, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ తో పాటు మొక్కలు కూడా అందజేస్తామన్నారు. మీలా నలుగురు కలిసి దోచుకోకుండా, ఇన్ని పథకాలు అమలు చేయడమేనా ఇందిరమ్మ పాలనలో ప్రజలకు మేము చేస్తున్న అన్యాయమని భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడితూ గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకున్నది కొండంతని, తాము కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నామని అన్నారు.  ఐఅండ్ పీఆర్ ద్వారా రూ. 1052 కోట్ల రూపాయలను అసత్యపు ప్రచారానికి గత బీఆర్ఎస్ పాలకులు అక్రమంగా వాడుకున్నారని ఆరోపించారు. తాము ఎవరికీ ఉపయోగపడని ధరణినీ పక్కన పెట్టి ప్రతీ ఒక్కరికీ ఉపయోగ పడేలా భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. పేదవాడికి ఏది ముందు అవసరమో అది చేస్తున్నామని, అందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. ఐటీడీఎ పరిధిలోని నియోజక వర్గాల్లో కోటా కంటే ఎక్కువ ఇళ్లు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ హయాంలో ప్రతీ తండాకు, ప్రతీ గ్రామానికి నాణ్యమైన కరెంట్ తో పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పారీదేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పదిహేను, పదహారు నెలల నుంచి ఏ విధమైన పాలనను మన ప్రభుత్వం అందిస్తుందో  రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే విధమైన మంచి సుపరిపాలన అందిస్తారని పొంగులేటి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మేల్యేలు జారే ఆదినారాయణ, రాందాస్ నాయక్,తెల్లం వెంకట్రావు, కార్పోరేషన్ చైర్మెన్లు రాయల నాగేశ్వర రావు, మువ్వా విజయ్ బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 

Related posts

కలెక్టరేట్‌లోనే లంచాల దందా… ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి

Ram Narayana

హైదరాబాద్ లో బెగ్గర్ ఆదాయం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Ram Narayana

కోటి దీపోత్సవానికి రాష్ట్ర పండుగ హోదా: రేవంత్‌రెడ్డి

Ram Narayana