Covid 19
అంతర్జాతీయం

మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియాలోని రెండు దేశాల్లో భారీగా కొవిడ్‌ కొత్త కేసులు (Covid Cases) నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్‌ అయ్యారు. ఆసియా దేశాల్లో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్ (Hong Kong)‌, సింగపూర్‌ (Singapore) దేశాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల శాంపిల్స్‌లో అనేకం పాజిటివ్‌గా తేలాయని తెలిపారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కరోనా పాజిటివ్‌గా తేలడం ఇదే తొలిసారని అన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కొవిడ్ మరణాలు నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది ఇదే గరిష్ఠ సంఖ్య అని కూడా తెలిపారు. రెండేళ్ల నాటి కొవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. అటు సింగపూర్ కూడా కొవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ అయింది. దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కొవిడ్ కేసుల సంఖ్యపై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. నివేదికను విడుదల చేసింది. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28 శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగినట్లు సమాచారం. థాయ్‌లాండ్‌, చైనా దేశాల్లోనూ కొవిడ్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. కేసుల పెరుగుదలతో ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.

Related posts

ఆమె స్వార్థపరురాలు.. కమలా హారిస్‌పై మండిపడ్డ మాజీ సభ్యురాలు…

Ram Narayana

సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్ర వాతావరణం

Ram Narayana

ఉగ్రవాదంపై తాజా నివేదిక.. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే..!

Ram Narayana