- జేమ్స్ కోమీ తన హత్యకు కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపణ
- ’86 47′ కోడ్‌తో కోమీ ఇన్‌స్టా పోస్ట్… ఆ తర్వాత డిలీట్
- కోమీ ఒక “బ్యాడ్ కాప్” అని ట్రంప్ ఘాటు విమర్శ
ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కోమీ కుట్ర పన్నారని, ఇందుకోసం కోడ్ భాషలో బెదిరింపులకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ కోమీ ఒక ‘బ్యాడ్ కాప్’ (చెడ్డ పోలీసు అధికారి) అని ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జేమ్స్ కోమీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ’86 47′ అనే కోడ్‌ను పోస్ట్ చేసి, ఆ తర్వాత దానిని తొలగించారు. ఈ కోడ్‌కు “అమెరికా 47వ అధ్యక్షుడిని చంపడం” అనే అర్థం వస్తుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ, “ఆ కోడ్ అర్థం జేమ్స్ కోమీకి కచ్చితంగా తెలుసు. నన్ను హత్య చేయాలనేది అతని ఉద్దేశమని స్పష్టమవుతోంది. కోమీ సమర్థుడు కాకపోవచ్చు, కానీ ఆ కోడ్ అర్థం చేసుకునేంత తెలివి అతనికి ఉంది. దేశాధ్యక్షుడిని చంపాలని కోమీ పిలుపునిచ్చాడు” అని విమర్శించారు.
అయితే, ఈ ఆరోపణలపై జేమ్స్ కోమీ స్పందించారు. తాను బీచ్‌లో షెల్స్ చిత్రాన్ని పోస్ట్ చేశానని, అధికారులు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ నంబర్లను హత్యలకు ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని, అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు రావడంతోనే పోస్ట్‌ను డిలీట్ చేసినట్లు కోమీ వివరణ ఇచ్చారు.
కోమీ పోస్ట్‌పై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే సీక్రెట్ సర్వీస్ అధికారులు కోమీని ప్రశ్నించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, గతంలోనూ డొనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియాలో దుండగుడి కాల్పుల్లో ట్రంప్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో ఫెన్సింగ్ వద్దకు రావడం, మరో సమావేశం సమీపంలో ఏకే-47తో ఓ వ్యక్తిని అరెస్టు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో ట్రంప్‌కు భద్రతను భారీగా పెంచారు. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.