- ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై స్టార్మర్ అల్టిమేటంపై మాస్కో ఆగ్రహం
- కాల్పులు ఆపకపోతే పుతిన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న స్టార్మర్
- స్టార్మర్ బెదిరింపులు బాధ్యతారహితమన్న రష్యా రాయబార కార్యాలయం
- శాంతి చర్చల్లో బ్రిటన్‌కు సంబంధం లేదని స్పష్టం చేసిన రష్యా
- గతంలో చర్చలను అడ్డుకున్నది లండనేనని మాస్కో ఆరోపణ
ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని, శాంతి చర్చలకు నిరాకరిస్తే అధ్యక్షుడు పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన హెచ్చరికలపై రష్యా తీవ్రంగా స్పందించింది. స్టార్మర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రష్యా, యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేసేలా యూకే వ్యవహరిస్తోందని ఆరోపించింది. పుతిన్ ను మీరు బెదిరించలేరు… ఇది మీకు సంబంధం లేని విషయం… దూరంగా ఉండండి అని స్పష్టం చేసింది. ఈ మేరకు లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
స్టార్మర్ చేసిన బెదిరింపులను ‘బాధ్యతారహితమైనవి’గా రష్యా అభివర్ణించింది. అసలు శాంతి చర్చల ప్రక్రియలో బ్రిటన్ ప్రత్యక్ష భాగస్వామి కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా, గతంలో జరిగిన శాంతి చర్చలను అడ్డుకోవడం ద్వారా లండన్ నిరంతరంగా సంఘర్షణను రెచ్చగొడుతూనే ఉందని మాస్కో ఆరోపించింది.
బ్రిటన్ అనుసరిస్తున్న రెచ్చగొట్టే ధోరణులు ఆ దేశానికే నష్టం కలిగిస్తాయని, దౌత్యపరమైన ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను మరింత జటిలం చేస్తాయని, శాంతి స్థాపనకు ఏమాత్రం దోహదపడవని స్పష్టం చేసింది. తమపై వస్తున్న ఆరోపణల ద్వారా బ్రిటన్ తన తప్పును తానే అంగీకరిస్తున్నట్లుగా ఉందని రష్యా వ్యాఖ్యానించింది.