అంతర్జాతీయం

అమెరికా-భారత్ మధ్య పెరిగిన గ్యాప్… అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునే దిశగా పాకిస్థాన్!

  • ట్రంప్ సుంకాలతో అమెరికా, భారత్ మధ్య పెరిగిన గ్యాప్
  • తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమంటున్న భారత్
  • ట్రంప్ తీరును తప్పుబడుతున్న సొంత పార్టీ నేతలు
  • అమెరికాతో బంధాలను బలోపేతం చేసుకునే దిశగా పాక్ అడుగులు
  • మరోసారి అమెరికాకు వెళుతున్న పాక్ ఆర్మీ చీఫ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదనపు సుంకాలతో భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత జూన్ లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వైట్ హౌస్ లో మునీర్ కు గౌరవ మర్యాదలు లభించాయి. ఆ పర్యటన సందర్భంగా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి మునీర్ మద్దతు ప్రకటించారు. తాజాగా మునీర్ మరోసారి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత సుంకాలను 25 శాతం పెంచిన ట్రంప్… భారత్ తన దారిలోకి రాకపోయేసరికి జరిమానాగా సుంకాలను మరో 25 శాతం పెంచారు. ఇదే సమయంలో పాకిస్థాన్ పై స్వల్ప సుంకాలను విధించారు. 

ఈ క్రమంలో అమెరికాతో భారత్ కు గ్యాప్ కొంత పెరిగింది. తమకు తమ దేశ ప్రయోజనాలే ప్రధానమని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యవహారశైలిపై భారత్ లో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఆయన తీరును తప్పుబడుతున్నారు. నమ్మకమైన మిత్రదేశం భారత్ తో కయ్యం వద్దని హితవు పలుకుతున్నారు.

మరోవైపు, ఇదే సమయంలో… అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. భారత్, అమెరికా మధ్య కొంత మేర బలహీనపడ్డ బంధాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే జనరల్ మునీర్ మరోసారి అమెరికాకు వెళ్తున్నారు.

రెండు నెలల్లో రెండోసారి.. మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్

Pak Army Chief Set For US Trip 2nd In 2 Months Amid Trumps Tariff War
  • పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి అమెరికా పర్యటన
  • రెండు నెలల వ్యవధిలోనే ఇది రెండో కీలక పర్యటన
  • గత జూన్‌లో ట్రంప్‌తో సమావేశమైన పాక్ సైన్యాధ్యక్షుడు
  • పాకిస్థాన్‌కు వాణిజ్య రాయితీలు, మెరుగైన సంబంధాలే సంకేతం
  • దక్షిణాసియాలో మారుతున్న రాజకీయ, వాణిజ్య సమీకరణాలు

ఓవైపు భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగుతూ కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా, మరోవైపు పాకిస్థాన్‌కు మాత్రం స్నేహ హస్తం చాస్తోంది. భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తున్న సమయంలో, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాసియాలో మారుతున్న ఈ సమీకరణాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు నిన్న ప్రకటించారు. దీంతో మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపైనా ఇలాంటి చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. “ఈ చర్య అన్యాయం, అహేతుకం, ఎంతమాత్రం సమర్థనీయం కాదు” అని పేర్కొంది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే తాము చమురు దిగుమతులు చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యల ద్వారా భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని తెలిపింది.

భారత్‌పై ఇలా కఠిన వైఖరి అవలంబిస్తున్న తరుణంలోనే, పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు మెరుగుపడుతుండటం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండు నెలల వ్యవధిలో రెండోసారి అమెరికాలో పర్యటించనున్నారు. గత జూన్‌లో ఆయన వాషింగ్టన్ వెళ్లినప్పుడు, ట్రంప్ స్వయంగా వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఆ పర్యటనలో పాకిస్థాన్‌కు వాణిజ్యపరంగా ప్రాధాన్యత ఇస్తామని, అక్కడి చమురు నిల్వల వెలికితీతను పరిశీలిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

ఇటీవల అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అధిపతి జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా కూడా పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత సైనిక పురస్కారమైన ‘నిషాన్-ఇ-ఇంతియాజ్’ను ప్రదానం చేసింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయకులు బలైన ఉగ్రదాడి తర్వాత భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం భారత్-అమెరికా మధ్య సంబంధాలు కొంతకాలంగా అంత సజావుగా లేవు. ఈ తాజా పరిణామాలు దక్షిణాసియాలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

ఇజ్రాయెల్‌తో యుద్ధం .. భారత్ కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

Ram Narayana

అవినీతి ఆరోపణలతో కోర్టుకు హాజరైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు…

Ram Narayana

రష్యా టౌన్ ను ఆక్రమించిన ఉక్రెయిన్..!

Ram Narayana