ఎంపీ వద్దిరాజు మహిళా లోకానికి శుభాకాంక్షలు
బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సుమారు వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని,మన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నదని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.భాద్రపద మాసం అమావాస్య నుంచి (రేపు ఆదివారం) తొమ్మిది రోజుల పాటు మహిళలు ప్రకృతిని, గౌరీదేవిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆయన చెప్పారు. స్థానికంగా లభించే తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను పేర్చి కులాలకు అతీతంగా పిల్లా పాపలతో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందోత్సవాల మధ్య జరుపుకునే ఈ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని ఎంపీ రవిచంద్ర వివరించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఏటా ఆడబిడ్డలకు చీరలను బహుమతిగా ఇవ్వడమే కాక ఈ పండుగను ఘనంగా జరిపించి ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యాన్ని తేవడంతో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కూడా “బతుకమ్మ”కు చోటు లభించడాన్ని ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రకృతిని, దైవత్వాన్ని ఆరాధించే ఈ బతుకమ్మ వేడుకలను మహిళలు భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని అభిలషించారు.విద్యా సంస్థలకు సెలవులు రావడం, విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు,కుంటలు నీళ్లతో నిండి ఉన్నందున పిల్లలు ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రజలకు హితవు పలికారు.ప్రపంచంలోనే అరుదైన ఈ పూల పండుగ సందర్భంగా రాష్ట్ర వాసులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాలలో నివసిస్తున్న,స్థిరపడిన తెలంగాణ ఆడబిడ్డలందరికి ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గౌరీదేవి కరుణా కటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా వర్థిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎంపీ వద్దిరాజు మనసారా ఆకాంక్షించారు.