నేనేం చేయాలో చెప్పు సోమన్న.. మంత్రి పొంగులేటి
హామీ ఇస్తున్నా.. తప్పక నెరవేరుస్తా…
ఆరోగ్యం జాగ్రత్త..త్వరగా కోలుకోవాలి..
ఆసుపత్రి బిల్లులన్నీ ఇప్పిస్తా…
ఉద్యమకారులకు తప్పక న్యాయం చేస్తాం..
తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్యను పరామర్శించిన మంత్రి పొంగులేటి
‘నేనేం మీ కోసం చేయగలనో చెప్పు సోమన్న.. నీకు మాట ఇస్తున్నా.. తప్పక నెరవేరుస్తా…’’ అని మంత్రి పొంగులేటీ సోమన్నకు హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్యతో పాటు అతని సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు పరిధిలోని ఆటోనగర్ లో ఉన్న సోమయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బత్తుల సోమయ్య ఉద్యమకారులకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన వారి కుటుంబాలు నేడు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాయని, అమరవీరుల తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టే వాళ్లు కరువయ్యారని సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని సోమయ్య కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది కార్పోరేషన్ ఏర్పాటు అని.., వెంటనే అమలు చేసేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సబ్ కమిటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అర్హత ఉన్న ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని కోరారు.
సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తాం:
‘సోమన్న మీరు సూచించిన ప్రతీ అంశము న్యాయమైనదే.. మీరు మీకోసం ఏదీ అడగడంలేదు.. ఉద్యమకారుల కోసమే అడుగుతున్నారు.. వాటిని పరిష్కరించేందుకు సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆస్పత్రికి అయిన ఖర్చులు సీఎంఆర్ఎఫ్ (సీఎం రిలిఫ్ ఫండ్) ద్వారా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆరోగ్యం జాగ్రత్త.. మీరు త్వరగా కోలుకోవాలని సూచించారు. మంత్రి వెంట మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ దయాకర్ రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి క్రిష్ణ, కుక్క సత్యం, తునికిపాటి చారీ, వడ్తియా రాజేష్ నాయక్, రామాంజనేయులు, బొలికొండ పాపయ్య, జంపాని అంజయ్య, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, ఉల్లంగి పద్మ, కొక్కెర శ్రీనివాస్, కొట్టం రంజితా రెడ్డి, కొట్టం శిరీష, భూక్యా సురేష్ నాయక్, అప్పలనేని రామారావు, పసునూరి అనిల్, మోహన్ రావు, అశోక్ సింగ్, వెంపటి వెంకన్న, అంబాల రామారావు, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
nenem cheyalo cheppu somanna..mantri ponguleti ..