అంతర్జాతీయం

అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన కిల్లర్‌.. పదేళ్ల పాటు దేశాన్ని వణికించాడు

అమెరికాను దశాబ్దకాలంగా వణికించిన గిల్గో బీచ్ వరుస హత్యల కేసులో నిందితుడు రెక్స్ హ్యూయర్‌మాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు. న్యూయార్క్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న తాను, మొత్తం ఎనిమిది మంది మహిళలను కిరాతకంగా హతమార్చినట్లు విచారణలో అంగీకరించాడు. అతని వాంగ్మూలం విన్న అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.

విచారణలో హ్యూయర్‌మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2007 నుంచి 2010 మధ్య కాలంలో నిందితుడు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. మహిళలను కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి చంపేవాడినని చెప్పాడు. ఆ తర్వాత వారి మృతదేహాలను ముక్కలుగా నరికి, బస్తాల్లో చుట్టి గిల్గో బీచ్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసినట్లు వివరించాడు. మొదట నలుగురి హత్యలోనే ఇతడి పాత్ర ఉందని భావించినా, విచారణలో మొత్తం 8 హత్యలు తానే చేసినట్లు ఒప్పుకోవడం గమనార్హం.

పక్కా ప్రణాళికతో హత్యలు చేసిన నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బర్నర్ ఫోన్లు వాడాడు. అయితే, తన భార్య ఇంట్లో లేని సమయాల్లోనే ఈ నేరాలకు పాల్పడినట్లు తేలింది. నిందితుడి కంప్యూటర్‌లో బాధితుల ఫోటోలు, సీరియల్ కిల్లర్ల గురించి వెతికిన సమాచారం పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. అంతిమంగా, మృతదేహాలను చుట్టిన బస్తాలపై లభించిన వెంట్రుకల డీఎన్‌ఏ, నిందితుడి భార్య డీఎన్‌ఏతో సరిపోలడంతో ఈ హత్యల మిస్టరీ పూర్తిగా వీడింది.

సమాజంలో గౌరవప్రదమైన ఆర్కిటెక్ట్‌గా, కుటుంబ పెద్దగా నటిస్తూ హ్యూయర్‌మాన్ ఇంతటి కిరాతకానికి పాల్పడటం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

అరేబియా సముద్రంలో పాక్ నౌకను వెంటాడిన భారత నేవీ షిప్.. !

Ram Narayana

చంద్రుడిపైన భూకంపాల తీవ్రత 20 రెట్లు ఎక్కువట..!

Ram Narayana

ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు…

Ram Narayana