ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్ వేలంలోఆటగాళ్లకు కోట్ల వర్షం…రిషబ్ పంతు కు 27 కోట్లు ,శ్రేయాస్ కు 26 .75 కోట్లు!

  • సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్
  • మహ్మద్ షమీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్
  • షమీని రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన హైదరాబాద్ ఫ్రాంచైజీ

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అత్యధిక ధర రికార్డులు రెండు సార్లు బద్దలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా… కాసేపటికే రిషబ్ పంత్ ను రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. 

ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ వేలంలో నికార్సయిన పేస్ బౌలర్ ను సొంతం చేసుకుంది. బుల్లెట్ బంతులతో వికెట్లు తీసే మహ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. 

షమీ గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల అతడిని గుజరాత్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. వేలానికి వచ్చిన షమీని… సన్ రైజర్స్ యాజమాన్యం పక్కా ప్రణాళికతో కొనుగోలు చేసింది. షమీ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడి కోసం ఇతర ఫ్రాంచైజీలు ఏమంత పోటీపడలేదు. చివరికి ఎస్ఆర్ హెచ్ షమీని రూ.10 కోట్లతో లాక్ చేసింది.

నేటి వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన ఇతర స్టార్ ఆటగాళ్ల వివరాలు

  • యజువేంద్ర చహల్- రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • జోస్ బట్లర్- రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • కేఎల్ రాహుల్- రూ.14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • మహ్మద్ సిరాజ్-  రూ.12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • మిచెల్ స్టార్క్- రూ.11.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • కగిసో రబాడా- రూ.10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • లియామ్ లివింగ్ స్టన్- రూ.8.75 కోట్లు (ఆర్సీబీ)
  • డేవిడ్ మిల్లర్- రూ.7.50 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక ఏ ఆటగాడికి ఇంత ధర పలకలేదు. పంత్ కోసం ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడినప్పటికీ, పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ ను ఎల్ఎస్ జీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 

ఇవాళే రెండు రికార్డులు బద్దలు కావడం విశేషం. గత సీజన్ లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో రికార్డు సృష్టించగా…. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ రికార్డు కాసేపట్లోనే తెరమరుగైంది. పంత్ ను కళ్లు చెదిరే ధర (రూ.27 కోట్ల )తో లక్నో ఎగరేసుకెళ్లింది.

పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ పేరుతో వేలం షురూ అయింది. ఈ లెఫ్టార్మ్ సీమర్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అర్షదీప్ సింగ్ కనీస ధర రూ.2 కోట్లు కాగా… సన్ రైజర్స్ అతడిని దక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడింది. రూ.18.75 కోట్ల వరకు సన్ రైజర్స్ వేలంలో నిలిచింది. 

అయితే, పంజాబ్ కింగ్స్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ఉపయోగించి రూ.18 కోట్లతో అర్షదీప్ ను సొంతం చేసుకుంది. 

అసలేమిటీ రైట్ టు మ్యాచ్ కార్డు…?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం తాము విడుదల చేసిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఈ రైట్ టు  మ్యాచ్ కార్డు సాయంతో వేలంలో మళ్లీ సొంతం చేసుకోవచ్చు. తాము రిలీజ్ చేసిన ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు…ఇతర ఫ్రాంచైజీలు పోటీపడుతున్నప్పటికీ… అతడ్ని రిలీజ్ చేసిన ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగిస్తే ఇతర ఫ్రాంచైజీలకు ఇక ఎలాంటి అవకాశం ఉండదు. సదరు ఆటగాడు తన పాత ఫ్రాంచైజీకే సొంతం అవుతాడు. ఇటీవలే అర్షదీప్ సింగ్ ను రిలీజ్ చేసిన పంజాబ్ కింగ్స్… ఇవాళ అతడ్ని ఈ విధంగానే సొంతం చేసుకుంది. 

Related posts

 ముగిసిన ఐపీఎల్ 2025.. విజేతల జాబితా ఇదే!

Ram Narayana

ఐపీఎల్ రిటెన్షన్… అన్ని జట్ల రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా ఇదే!

Ram Narayana

టీ20ల నుంచి వైదొలిగిన‌ నాకు ఈ ధ‌ర‌ సరైనదే.. రిటెన్షన్ వాల్యూపై రోహిత్ శ‌ర్మ‌!

Ram Narayana