- 450 కి.మీ. రేంజ్ ‘అబ్దాలీ’ని పరీక్షించిన పాకిస్థాన్
- ‘ఇండస్’ విన్యాసాల్లో పాక్ అస్త్ర ప్రదర్శన
భారత్, -పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో, పాకిస్థాన్ మరో కీలక సైనిక చర్యకు ఉపక్రమించింది. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించ గల ‘అబ్దాలీ’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పాక్ సైన్యం వెల్లడించింది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ‘ఇండస్’ విన్యాసాలలో భాగంగా ఈ ‘అబ్దాలీ’ వెపన్ సిస్టమ్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి. తమ సైనిక దళాల కార్యాచరణ సంసిద్ధతను, క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాయి. ప్రత్యేకించి, క్షిపణిలోని అధునాతన నావిగేషన్ వ్యవస్థలతో పాటు ఇతర కీలక సాంకేతిక అంశాలను ధృవీకరించుకునేందుకే ఈ ప్రయోగం జరిపినట్లు పాకిస్థాన్ వివరించింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తరచూ క్షిపణి పరీక్షల నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏప్రిల్ 24-25, ఏప్రిల్ 26-27 తేదీల్లో కరాచీ తీరంలోని ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో క్షిపణి ప్రయోగాలు నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించింది. తాజాగా ఏప్రిల్ 30 నుంచి మే 2 మధ్య మరో సారి పరీక్షలు చేపడుతున్నట్లు తెలియ జేసింది.