జాతీయ వార్తలు

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం .. బాల్కనీ నుంచి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ద్వారకా సెక్టార్‌-13 లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం 9:58 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిది, తొమ్మిది అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. అలా ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

ముందుగా పదేళ్ల ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి బయటపడేందుకు బాల్కనీ నుంచి కిందుకు దూకేశారు. పిల్లల తండ్రి 35 ఏళ్ల యష్‌ యాదవ్‌ కూడా కిందకు దూకాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related posts

ఉన్నతాధికారుల జూమ్ మీటింగ్‌లో బూతు వీడియో ప్రత్యక్షం!

Ram Narayana

తమిళనాడు ఎన్నోర్ థర్మల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 9 మంది మృతి!

Ram Narayana

బెంగాల్ రాజకీయ ‘చాణక్యుడు’ ముకుల్ రాయ్ కన్నుమూత!

Ram Narayana